హోదా పోరు: ఏపీ వ్యాప్తంగా బిజిలీ బంద్, నగరాలు చీకటిమయం, లైట్లు ఆర్పేసిన జగన్
అమరావతి: ప్రత్యేక హోదా పోరు రోజు రోజుకు ఉధృతమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ మంగళవారం రాత్రి 7గంటల నుంచి 7.30గంటల వరకు బిజిలీ బంద్ నిర్వహించి తమ ప్రత్యేక హోదా ఆకాంక్షను మరోసారి కేంద్రానికి తెలియజేసే ప్రయత్నం చేశారు.
ఏపీలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో విద్యుత్ ఆపేసి ప్రజలు, వ్యాపారులు తమ హోదా కాంక్షను చాటారు. సీపీఐ ఇచ్చిన ఈ బిజిలీ బంద్‌కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన, వామపక్షాలు, హోదా సమితి నాయకులు, ఇతర పార్టీలు మద్దతు పలికాయి.
ఈ సందర్భంగా పలు చోట్ల ర్యాలీలు నిర్వహించాయి. బిజిలీ బంద్ కారణంగా ప్రభుత్వానికి లాభమే అయినా.. టీడీపీ మాత్రం ఈ బంద్ కార్యక్రమానికి మద్దతు ఇవ్వలేదని చలసాని శ్రీనివాస్ అన్నారు. ఈ నిరసనతో కేంద్రం దిగివస్తుందని కాదని, ఇది సింబాలిక్ నిరసన అని తెలిపారు.

జాతీయ రహదారుల దిగ్బంధం, జైల్ భరో లాంటి కార్యక్రమాలను చేపడతామని చలసాని చెప్పారు. చంద్రబాబు బిజిలీ బంద్ కు ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కేంద్రంతో ఎవరైనా కుమ్మక్కైతే తీవ్ర పరిణామాలుంటాయని అన్నారు.
వైసీపీ నేత భూమన కరుణాకర్ మాట్లాడుతూ... హోదా విషయంలో చంద్రబాబు మొదటి ద్రోహి అని.. మోడీ రెండో ద్రోహి అని అన్నారు. ప్రత్యేక హోదా కోసం చేసే ఆందోళలకు వైసీపీ మద్దతు ఉంటుందని అన్నారు.
ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి బిజిలీ బంద్‌లో పాల్గొన్నారు. ఆయన బస చేసిన శిబిరంలో లైట్లు ఆపి హోదా ఉద్యమంలో పాల్గొన్నారు. కాగా, తిరుపతి, విజయవాడలో విద్యుత్ లైట్లు ఆర్పేసి నిరసన తెలియజేశారు. ఇతర నగరాలు, పట్టణాల్లో కూడా విద్యుత్ దీపాలు ఆర్పేసి నిరసన తెలిపారు. బిజిలీ బంద్ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని మధు తెలిపారు. ప్రజలు, వ్యాపారులు అందరూ పాల్గొన్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications