ఎయిడెడ్ విలీనంపై విద్యార్థుల ఆందోళన: విజయవాడలో ఉద్రిక్తత; జగన్ సర్కార్ కు పోతిన మహేష్ వార్నింగ్
ఎయిడెడ్ విద్యాసంస్థలను యధావిధిగా కొనసాగించాలని, ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనం ఆపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై కొనసాగుతున్న ఆందోళనలో భాగంగా, ఈ రోజు విజయవాడలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జనసేన, పలు విద్యార్థి సంఘాల నేపథ్యంలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది.

విద్యార్ధి నాయకుల అరెస్ట్ తో విజయవాడలో ఉద్రిక్తత
విజయవాడ వన్ టౌన్ లో ఉన్న ఎస్ కె పి వి వి హిందూ హైస్కూల్ ని ఎయిడెడ్ లోనే కొనసాగించాలని విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఎస్ కె పి వి వి హిందూ హై స్కూల్ లో విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో హిందూ హై స్కూల్ యాజమాన్యం వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం బయటకు రాకపోవడంతో స్కూల్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు విద్యార్థి సంఘం నాయకులు. పరిస్థితిని అదుపు చేయడం కోసం ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీనికి నిరసనగా పోలీసుల వాహనాలపై విద్యార్థులు దాడికి ప్రయత్నించారు.

ఎయిడెడ్ విలీనం జీవో రద్దు చేసే వరకు పోరాటం చేస్తాం
పరిస్థితి చేయి దాటుతున్న క్రమంలో అదుపులోకి తీసుకున్న నాయకులను పోలీసులు విడిచి పెట్టడంతో విద్యార్థులు శాంతించారు. ఉదయం 9:00 నుండి 12 గంటల వరకు సాగిన ధర్నా కార్యక్రమంలో ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనం జీవోను రద్దు చేసే వరకు పోరాటం సాగిస్తూనే ఉంటామని విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనానికి సంబంధించిన జీవోలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోతే విద్యార్థులతో కలిసి తాడేపల్లిలోని ముట్టడిస్తామని జనసేన నేత పోతిన మహేష్ హెచ్చరించారు.

ఎయిడెడ్ స్కూల్స్ మూసివెయ్యాలనే నిర్ణయం అందుకే : పోతిన మహేష్
ఎయిడెడ్ పాఠశాలల విలీన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు .ఎయిడెడ్ పాఠశాలల మూసివేత తుగ్లక్ చర్య అని మండిపడిన పోతిన మహేష్ విద్యార్థుల జీవితాలతో జగన్ ప్రభుత్వం ఆడుకుంటోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఎయిడెడ్ పాఠశాలను మూసివేయడం, వేల కోట్లు విలువ చేసే ఆస్తులను దోచుకోవడం కోసమేనని ఆరోపించారు. పేద మధ్య తరగతి ప్రజలు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చెల్లించగలరు అంటూ ప్రశ్నించినా పోతిన మహేష్ పేదలకు నాణ్యమైన విద్యను దూరం చేయడం దుర్మార్గమని అభిప్రాయపడ్డారు.

జగన్ కపట నాటకాలు అందరికీ అర్థమైపోతున్నాయి : పోతిన మహేష్
అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేయడం, లాఠీచార్జీలు చేయడం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కపట నాటకాలు అందరికీ అర్థమైపోతుంది అని పేర్కొన్న ఆయన ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది అంటూ స్పష్టం చేశారు. విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా అవినీతి మంత్రి వెల్లంపల్లి స్పందించాలని దేవుడి ఆస్తులు దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు తెలుసని, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై నిప్పులు చెరిగారు.

ఎయిడెడ్ విలీన నిర్ణయం మార్చుకోకుంటే తాడేపల్లి సీఎం జగన్ ఇంటి ముట్టడి
సీఎం జగన్ స్పందించి ఎయిడెడ్ విలీనం నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా సీఎం జగన్ స్పందించకపోవటం దారుణం అని అభిప్రాయపడ్డారు. లేదంటే తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని తేల్చి చెప్పారు జనసేన నేత పోతిన మహేష్. విద్యార్థుల పక్షాన జనసేన పోరాటం చేస్తుందని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications