రైతు వేషంలో సబ్ కలెక్టర్-ఆ షాపుల యజమానులకు ఊహించని షాక్-రెడ్ హ్యాండెడ్‌గా పట్టేసుకున్నాడు...
అధికారులు లేదా ప్రజాప్రతినిధులతో మారు వేషంలో అకస్మిక తనిఖీలు చేయడం సినిమాల్లో ఎక్కువగా చూసుంటాం. నిజ జీవితంలోనూ అడపాదడపా ఇలాంటి తనిఖీలు చోటు చేసుకుంటాయి.నిజాయితీ,నిబద్దత కలిగిన కొంతమంది అధికారులు ప్రజల ఇబ్బందులను తెలుసుకునేందుకు ఇలా మారు వేషాల్లో తనిఖీలు చేస్తుంటారు. తాజాగా కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ ఇలాగే మారు వేషంలో వెళ్లి ఎరువుల షాపులు నడిపే యజమానులకు షాకిచ్చాడు. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు ఎరువులను విక్రయిస్తున్న వైనాన్ని రెడ్ హ్యాండెడ్‌గా బట్టబయలు చేశారు.

సాధారణ రైతులా లుంగీ ధరించి...
కైకలూరు ప్రాంతంలోని ఎరువుల దుకాణాల్లో ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు వాటిని విక్రయిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్‌కు సమాచారం అందింది. దీంతో సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్‌ను కలెక్టర్ రంగంలోకి దింపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రవీణ్ మారు వేషంలో ఎరువుల షాపుల వద్ద తనిఖీలకు వెళ్లారు. సాధారణ రైతులా లుంగీ,చొక్కా ధరించి.. మొదట శ్రీలక్ష్మీ గణేష్ ట్రేడర్స్ షాపు వద్దకు వెళ్లారు. ఆ సమయానికి షాపు మూసి ఉండటంతో అక్కడే ఉన్న రైతులతో కొద్దిసేపు మాట్లాడారు. ఎరువుల బస్తాలు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు చెప్పడంతో వెంటనే వ్యవసాయ శాఖ ఏఓని పిలిపించి తనిఖీలు నిర్వహించారు. అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు తేలడంతో చర్యలకు ఆదేశించారు.

రెండు షాపులు సీజ్...
అక్కడినుంచి వాసవీ ఫెర్టిలైజర్స్ షాపుకు వెళ్లారు. యూరియా బస్తా కావాలని షాపులో ఉన్న వ్యక్తిని అడిగాడు. స్టాక్ లేదని చెప్పడంతో సమీపంలోని నాగదత్త ఏజెన్సీ అనే మరో షాపుకు వెళ్లారు. యూరియా,డీఏపీ కావాలని అడిగారు. ఎమ్మార్పీ ప్రకారం యూరియా బస్తా ధర రూ.266.50,డీఏపీ బస్తా రూ.1200 కాగా... ఆ షాపు నిర్వాహకులు యూరియా బస్తాను రూ.280కి,డీఏపీ బస్తాను రూ.280కి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. బయోమెట్రిక్ కూడా లేకుండానే బిల్లు ఇవ్వడంతో ఆశ్చర్యపోయారు. బోర్డులో సూచించిన ధరల కన్నా ఎక్కువ ఎందుకు వసూలు చేస్తున్నారని గద్దించి అడిగారు. దీంతో షాపు నిర్వాహకులు... అందరికీ అలాగే విక్రయిస్తున్నామని చెప్పారు. ఎరువుల బస్తాలను అధిక ధరలకు విక్రయిస్తున్న రెండు షాపులను సీజ్ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా తహశీల్దార్‌ను సబ్ కలెక్టర్ ఆదేశించారు. రైతుల కోసం ఇలా మారువేషంలో వచ్చిన సబ్ కలెక్టర్ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారారు.
Recommended Video

గతంలో విజయనగరం జాయింట్ కలెక్టర్...
గతేడాది విజయనగరం జాయింట్ కలెక్టర్ కిశోర్ కుమార్ ఇలాగే మారు వేషంలో అకస్మిక తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో కూరగాయలు అధిక ధరలకు విక్రయిస్తున్నారనే సమాచారంపై ఆయన మారువేషంలో తనిఖీలకు వెళ్లారు. పంచె,బనియన్ ధరించి సాధారణ వ్యక్తిలా మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ కూరగాయలు విక్రయిస్తున్నవారి నుంచి ధరల గురించి ఆరా తీశారు. కొంతమంది వ్యాపారులు ఎక్కువ ధరలకు కూరగాయలు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వచ్చిన వ్యక్తి జాయింట్ కలెక్టర్ అని తెలిసి వ్యాపారులు అవాక్కయ్యారు.