ఏపీలో దేవుళ్లకూ రక్షణ లేకుండా పోయింది... హిందూ ధర్మానికి,సంప్రాదాయాలకు కళ్లెం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చాక హిందూ ధర్మానికి,సంప్రాదాయాలకు కళ్లెం పడిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముడి విగ్రహ ధ్వంసాన్ని మరకవముందే రాజమండ్రిలోని విఘ్నేశ్వరస్వామి ఆలయంలో సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజలకు,ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ దాడులు ముమ్మాటికీ ప్రభుత్వ అలసత్వ వైఖరి వల్లే చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు.

ఏం చర్యలు తీసుకుంటున్నారు..? : చంద్రబాబు
హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.విజయవాడ దుర్గ గుడిలో 3 వెండి సింహాల ప్రతిమలు మాయమైతే ఇప్పటివరకూ గుర్తించలేదని అన్నారు. అంతర్వేదిలో లక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలో రథం తగలబడితే నిందితులను ఇప్పటికీ అరెస్ట్ చేయలేదన్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు నిత్యకృత్యమవడం దురదృష్టకరం అన్నారు.

జగన్ స్పందించాలి : అచ్చెన్నాయుడు
హిందూ దేవాలయాలపై దాడులను రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా తీవ్రంగా ఖండించారు. టీవీల ముందు కనిపించి 'ఆ దేవుని దయతో..' అని మాట్లాడటం కాకుండా దేవుళ్లకు జరుగుతున్న అవమానాలపై జగన్ స్పందించాలన్నారు. విజయనగరంలోని రామతీర్థంలో రాముడి విగ్రహ ధ్వంసం మరవకముందే ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇకనైనా అహంకారాన్ని వీడకపోతే దేవుడే వాళ్ల మదాన్ని అణగదొక్కుతారని మండిపడ్డారు.

ఆందోళనలకు పిలుపునిస్తాం...
గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదని అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ పాలనలో ప్రజలకే కాదు దేవుళ్లకు కూడా రక్షణ లేదన్నారు. అసలు రాష్ట్రంలో దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారో లేరో అర్థం కావడం లేదని విమర్శించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం విగ్రహాల ధ్వంసంపై సీరియస్‌గా స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిస్తామన్నారు. రాజమండ్రి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.