జగన్ ఇంటి గడప తొక్కిన సుగాలి ప్రీతి కుటుంబం.. ఊహించని ట్విస్ట్
సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని నివాసంలో మంగళవారం సుగాలి ప్రీతి తల్లిదండ్రులు పార్వతి, రాజు నాయక్‌లు వైఎస్ జగన్‌ను కలిశారు. గత తొమ్మిదేళ్లుగా తమ కుమార్తె మరణంపై న్యాయం కోసం తాము చేస్తున్న పోరాటాన్ని, ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను ఆయనకు వివరించి, తమకు న్యాయ సహాయం అందించాలని కన్నీటితో విన్నవించారు.
వైఎస్ జగన్‌తో భేటీ అనంతరం ప్రీతి తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. "2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో మా కుమార్తె సుగాలి ప్రీతిపై ఘోరంగా అత్యాచారం చేసి హత్య చేశారు. తొమ్మిదేళ్లు గడుస్తున్నా మాకు ఇప్పటికీ పూర్తి న్యాయం జరగలేదు. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం కేసును తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది. కానీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా బాధను గుర్తించి ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తూ జీవో జారీ చేశారు" అని వారు గుర్తుచేసుకున్నారు.

అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ కుటుంబానికి కర్నూలు నగరంలో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వడంతో పాటు ప్రీతి తండ్రి రాజు నాయక్‌కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించి అండగా నిలిచారని జగన్ చేసిన సహాయాన్ని కొనియాడారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ కట్.. సీబీఐ విచారణ బంద్!
రాష్ట్రంలో మళ్లీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును పూర్తిగా పక్కన పెట్టేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రస్తుతం సీబీఐ విచారణ కూడా నిలిచిపోయిందని, విచారణను పునరుద్ధరించేలా తమకు అవసరమైన లీగల్ సపోర్ట్ అందించాలని వారు వైఎస్ జగన్‌ను కోరారు. "ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే నెపంతో గతంలో మాకు ఇస్తున్న పెన్షన్‌ను కూడా ఈ ప్రభుత్వం నిలిపివేసింది. స్థానిక అధికారులు కూడా ఇదే విషయాన్ని మాకు ముఖం మీదే చెప్తున్నారు" అని ప్రీతి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ భరోసా.. లీగల్ సపోర్ట్ ఇస్తాం!
బాధిత తల్లిదండ్రుల ఆవేదనను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సావధానంగా విన్నారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షలతో ఒక నిరుపేద, బాధిత కుటుంబానికి అందాల్సిన పెన్షన్‌ను నిలిపివేయడం, కేసును పక్కనపెట్టడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రీతి కుటుంబానికి చేసిన ఆర్థిక, సామాజిక సహాయాన్ని గుర్తు చేస్తూ.. భవిష్యత్తులోనూ వారి కుటుంబానికి పార్టీ పరంగా అన్ని రకాల న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సుగాలి ప్రీతి కేసులో దోషులకు శిక్ష పడే వరకు తాము అండగా ఉంటామని జగన్ వారికి గట్టి భరోసా ఇచ్చారు.














Click it and Unblock the Notifications