చంద్రబాబు బెయిల్ రద్దవుతుందా లేదా ?- సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ !
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు గతంలో హైకోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. స్కిల్ కేసులో హైకోర్టు బెయిల్ ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పులో లోపాలు ఉన్నాయని, కేసు దర్యాప్తులో ఉండగా మెరిట్స్ తో సంబంధం లేకుండా చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడంపై ఆభ్యంతరాలు వ్యక్తం చేసింది.
చంద్రబాబుకు స్కిల్ కేసులో ప్రమేయం ఉన్నట్లు హైకోర్టుకు ఆధారాలు సమర్పించినా వాటిని పట్టించుకోకుండా బెయిల్ ఇచ్చిందని ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీలులో పేర్కొంది. హైకోర్టు తీర్పు సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకంగా ఉందని ప్రభుత్వం చెబుతోంది. దీంతో హైకోర్టు చంద్రబాబుకు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరుతోంది. దీనిపై సుప్రీంకోర్టు తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారింది.

గతంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును ఏ37గా చేర్చిన ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ 10న అరెస్టు చేసింది. నంద్యాలలో అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో హాజరుపర్చింది. అనంతరం సీఐడీ వినతి మేరకు ఏసీబీ కోర్టు చంద్రబాబు రిమాండ్ విధించి రాజమండ్రి జైలుకు పంపింది. ఆ తర్వాత 52 రోజుల రిమాండ్ తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యారు. అనంతరం హైకోర్టు చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసింది.
దీన్ని సవాల్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆధారాలను సరిగ్గా పరిశీలించలేదని, స్కిల్ కేసులో దర్యాప్తు పూర్తికాకుండానే ముందస్తుగా నిర్ణయం ప్రకటించేసిందని ఏపీ ప్రభుత్వం చంద్రబాబు బెయిల్ పై అభ్యంతరాలు వక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ పై సుప్రీంకోర్టు తీసుకోబోయే నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీ ప్రభుత్వం కూడా చంద్రబాబు బెయిల్ రద్దవుతుందని ఆశాభావంగా ఉంది.












Click it and Unblock the Notifications