చంద్రబాబూ! మన ఇంజనీర్లపై నమ్మకం లేదా?: అమరావతిపై సురవరం లేఖ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్‌ను భాగస్వామ్యం చేయడంపై సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మన దేశంలోని ఇంజనీర్లపై ఎందుకు విశ్వాసం లేదని ఆయన ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన బుధవారం చంద్రబాబుకు ఓ లేఖ రాశారు.
రాజధాని నిర్మాణంలో సింగపూర్‌కు భాగస్వామ్యం కల్పించడం మన నిపుణులను అవమానించడమేనని ఆయన అన్నారు. అమరావతి అనేది పుణ్యక్షేత్రం కాదు, రాష్ట్ర పరిపాలనా కేంద్రమని ఆయన అన్నారు. అది మత కార్యక్రమంలా కాకుండా సెక్యులర్ పద్ధతిలో జరగాలని సురవరం అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపన ఒక్క రోజు కార్యక్రమమని, దాన్ని ఆడంబరంగా నిర్వహిస్తూ 400 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వృధా అని ఆయన అన్నారు. ఎపికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న సమయంలో రాజధానికి ఆడంబరంగా శంకుస్థాపన చేయడం వల్ల ప్రత్యేక హోదా ప్రతిపాదన బలహీన పడుతుందని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సిపిఐ, సిపిఎంలు ఉమ్మడి లేఖ రాశాయి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేయాలని ఆ పార్టీలు నరేంద్ర మోడీని కోరాయి. వెనుకబడిన ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాయి.
ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 16 నెలలు గడుస్తున్నా హామీల అమలుకు ఇంత వరకు ఏ విధమైన చర్యలూ చేపట్టలేదని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు విమర్సించాయి. విభజన చట్టం హామీల అమలుపై అమరావతి శంకుస్థాపన సభలో ప్రధాని ప్రకటన చేయాలని ఆ లేఖలో కోరాయి.












Click it and Unblock the Notifications