కాదంబరీ జెత్వానీ కేసులో కీలక పరిణామాలు- హైకోర్టుకెక్కిన ఐపీఎస్..!
ఏపీలో సంచలనం రేపుతున్న ముంబై నటి కాదంబరీ జెత్వానీ వేధింపుల వ్యవహారంలో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు కింది స్దాయి సిబ్బంది కూడా ఇప్పటికే సస్పెండ్ అయ్యారు. వీరిపై తదుపరి చర్యలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో వారు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించారు. దీంతో ఇందులో ఒకరైన ఓ ఐపీఎస్ అధికారి హైకోర్టును ఆశ్రయించారు.
కాదంబరీ జెత్వానీపై వేధింపుల వ్యవహారంలో ఇప్పటికే సీనియర్ ఐపీఎస్ లు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వీరిపై తదుపరి చర్యలకు ప్రభుత్వం సిద్దమవుతోంది. దీంతో వీరిలో ఒకరైన ఐపీఎస్ కాంతి రాణా టాటా ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ టాటా దాఖలు చేసుకున్న పిటిషన్ పై హైకోర్టు స్పందించింది. కాదంబరీ జెత్వానీపై వేధింపుల కేసులో అరెస్టు కాకుండా కాంతి రాణా టాటా దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై సోమవారం విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది.

మరోవైపు కాదంబరీ జెత్వానీపై వేధింపుల కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. దీంతో ఆ తర్వాత నిందితులుగా ఉన్నట్లు భావిస్తున్న ముగ్గురు ఐపీఎస్ లు అప్రమత్తమవుతున్నారు. వీరిలో ఒకరైన కాంతి రాణా టాటా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో ఇతర ఐపీఎస్ లు కూడా అదే బాట పట్టే అవకాశం ఉంది. అదే జరిగితే వీరి పిటిషన్లపై హైకోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. టాటా పిటిషన్ పై సోమవారం విచారణ లోపు ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసే అవకాశాలూ లేకపోలేదు.












Click it and Unblock the Notifications