టీడీపీ, జనసేన మధ్య ఖరారైన సీట్లు?? బీజేపీ పరిస్థితి ఏమిటి?
తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య దాదాపుగా పొత్తు ఖరారవుతుందనే భావనలో రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలున్నారు. ఒకరకంగా ఈ రెండు పార్టీల శ్రేణులు పొత్తులపై మానసికంగా సిద్ధపడివున్నారు. కాకపోతే ఎన్ని సీట్లు జనసేనకు కేటాయిస్తారు? ఆ పార్టీ ఏ సీట్లు అడగబోతోంది? అడిగిన సీట్లలో జనసేన బలోపేతంగా ఉందా? ఇప్పటివరకు తాము తిరిగి కష్టపడిన సీటును జనసేనకు కేటాయిస్తారా? అంటూ లోలోన తెలుగు తమ్ముళ్లు మథనపడుతున్నారు.

వ్యతిరేక ఓటు చీలిపోకుండా
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండాలంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. జనసేన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపుల ఓటుబ్యాంకు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టిసారించిందని, ఇప్పటికే కొన్ని సీట్లను గుర్తించారని, అలాగే పవన్ కల్యాణ్ కూడా పోటీచేసే నియోజకవర్గం ఖరారైందని చెబుతున్నారు.


జనసేన 60 అడుగుతోంది
ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో జనసేన 60 సీట్లు అడుగుతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఒకవేళ బీజేపీతో పొత్తుంటే తెలుగుదేశం పార్టీ 135 సీట్లలో, జనసేనకు 30 సీట్లు, బీజేపీకి 10 సీట్లు అంటూ గతంలో ఒక వార్త చక్కర్లు కొట్టింది. అయితే బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాము కుటుంబ పార్టీలోను, అవినీతి పార్టీలతోను పొత్తుపెట్టుకోమంటూ ప్రకటించారు. బీజేపీకి జనసేన మిత్రపక్షం. పార్టీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు పొత్తులపై సిద్ధంగానే ఉన్నామని పవన్ ప్రకటించారు. అయితే బీజేపీ ఇచ్చే రోడ్‌మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నానన్నారు.

ఏం చేద్దామనేది అప్పుడు ఆలోచిద్దాం
గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి, బీజేపీ కి మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. బీజేపీ నుంచి ఎటువంటి స్పందనా లేకపోతే ఒకవేళ అవసరమైతే జనసేన పార్టీ బీజేపీతో తెగదెంపులు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో పరిపాలన బాగోలేదంటూ, అభివృద్ధిలో వెనకపడ్డామంటూ తెలుగుదేశం, జనసేన భావిస్తున్నాయి. బీజేపీ కలిసివస్తే సరి.. రాకపోతే ఏం చేయాలనేది ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందామనే ఆలోచనలో ఇరు పార్టీల నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.