TDPలో అదిరిపోయే స్కెచ్ వేసిన చంద్రబాబు
గెలుపోటములను శాసించేది యువతే. అటువంటి యువతను ఆకట్టుకోవడానికి చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల్లో 40 శాతం టికెట్లు యువతకే అని ప్రకటించారు.
రాజకీయాలంటే ఎప్పుడూ చేత్తో కర్ర పట్టుకొని, మరో ఇద్దరు నడిపిస్తుండగా నడుస్తూ వచ్చే నాయకుణ్ని చూడటానికి అలవాటు పడిన ప్రజలకు 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ యువత రాజకీయాల్లోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుందో ఎక్కువ శాతం యువతను ఎంపిక చేసి చూపించారు. అప్పుడు ఎంపిక చేయబడ్డ యువతంతా ప్రస్తుతం నడివయసుకు వచ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీలోకి కొత్తరక్తం ఎక్కించాల్సిన అవసరం వచ్చిందని పార్టీ అధినేత చంద్రబాబు గుర్తించారు.

గెలుపోటమును నిర్ణయించేది వారే
గెలుపోటములను శాసించేది యువతే. అటువంటి యువతను ఆకట్టుకోవడానికి చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల్లో 40 శాతం టికెట్లు యువతకే అని ప్రకటించారు. గత ఎన్నికల్లో యువత వైసీపీవైపు, జనసేనవైపు మొగ్గుచూపించింది. టీడీపీవైపు చాలా తక్కువ శాతం యువత మొగ్గుచూపించింది. దీంతో యువతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని పార్టీలో అందరికీ చెబుతూనే ఆచరించడం మొదలుపెట్టారు. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులంతా లోకేష్ నాయకత్వంలో పనిచేయడానికి నిరాకరిస్తున్నారు. వయసులో, తరంలో అంతరాన్ని గుర్తించిన లోకేష్ తనకంటూ ఒక టీమ్ ను ఎంపికచేసుకోవడం ప్రారంభించారు. అంతా నవతరం.. యువతరం ఉండేలా చూసుకుంటున్నారు.

యువతరం లక్ష్యంగానే యువగళం
యువతను లక్ష్యంగా చేసుకొనే నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు కుదిరితే ఎక్కువ మంది యువత పవన్ పై మొగ్గుచూపిస్తారు కాబట్టి అది తమకు ప్లస్ పాయింట్ గా మారుతుందని టీడీపీ అధిష్టానం అంచనా వేసుకుంటోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే యువతరం నాయకులకు ఇన్ ఛార్జి హోదా కట్టబెడుతూ రాబోయే ఎన్నికల్లో టికెట్లు వారికేననే గ్యారంటీని పంపిస్తోంది.

యువత ప్రాతినిధ్యాన్ని పెంచేలా..
నెల్లూరు జిల్లా కోవూరులో దినేష్ రెడ్డి, గోపాలపురంలో మద్దిరాజు వెంకట్రాజు, తునిలో యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య, కోనసీమలోని పి.గన్నవరం నియోజకవర్గానికి బాలయోగి కుమారుడు హరీష్ ను, నెల్లిమర్లకు బంగార్రాజును, సత్యవేడుకు మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె హెలెన్ ను ఇన్ ఛార్జిగా నియమించారు. అలాగే పర్చూరు, అద్దంకి తదితర స్థానాల్లో యువ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఎక్కడికక్కడ యువత సంఖ్యను పెంచుతూ, వారి ప్రాతినిధ్యాన్ని పార్టీలో పెంచుతూ యువతరాన్ని ఆకట్టుకునేలా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. భూమా అఖిలప్రియలాంటివారు యువతంతా లోకేష్ పాదయాత్రలో పాల్గొని మద్దతు ప్రకటించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో 40 శాతం టికెట్లు యువతకు కేటాయించబోతున్న చంద్రబాబు ఎటువంటి ఫలితాన్ని అందుకుంటారో వేచిచూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications