రాష్ట్రమంతా ఒక ఎత్తు... ఈ నియోజకవర్గాలు మరో ఎత్తు..
తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో 23 నియోజకవర్గాలను కైవసం చేసుకోగలిగింది. అందులో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి అనుబంధంగా కొనసాగుతున్నారు. మిగతా 19 మంది ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో చురుగ్గా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ 19 మందికి సీట్లను చంద్రబాబు ఖరారు చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి మొత్తం 175 నియోజకవర్గాలను కైవసం చేసుకోవాలని లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు.

లక్ష్యాన్ని నిర్దేశించిన ముఖ్యమంత్రి జగన్
తన ప్రణాళికలో భాగంగా తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో విజయం సాధించిన నియోజకవర్గాల్లో ఈాసారి వైసీపీ జెండా ఎగరాలనే లక్ష్యాన్ని జగన్ నిర్దేశించారు. ఈమేరకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజకవర్గాల్లో చురుగ్గా తిరుగుతుండటంతోపాటు బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వీరిని ఓడించడానికి ప్రస్తుతం వైసీపీ తరఫున నియోజకవర్గ ఇన్ఛార్జిలు ఉన్నారు. వీరితోపాటు అదనపు సమన్వయకర్తలను నియమించారు. అంతర్గతంగా ఇక్కడి పరిస్థితులపై ఎంపిక చేసిన 50 మంది కార్యకర్తలు సర్వే నిర్వహిస్తూ ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రధాన కార్యాలయానికి చేరవేస్తున్నారు.

హెచ్చరించి పంపించిన చంద్రబాబు
నియోజకవర్గ ఇన్ ఛార్జిలు, అదనపు సమన్వయకర్తలతోపాటు వీరిని సమన్వయం చేసుకోవడానికి మాజీ మంత్రులను నియమించారు. ఒక్కో నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేను ఓడించడానికి వైసీపీ తరఫున ముగ్గురు నేతలతోపాటు కార్యకర్తలు, వాలంటీర్లు కూడా పనిచేస్తున్నారు. దీన్ని గమనించిన తెలుగుదేశం పార్టీ అధినేత సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. నలుగురు వైసీపీకి అనుబంధంగా కొనసాగుతుండగా సిట్టింగ్ లు 19 మంది ఉన్నారు. ఆ నలుగురు వైసీపీలో చేరినప్పటికీ వీటిని కూడా టీడీపీ సీట్లగానే చంద్రబాబు పరిగణిస్తున్నారు. తాను నిర్వహింపచేసిన సర్వేలో ఈ 23 నియోజకవర్గాల్లో టీడీపీ పటిష్టంగా ఉందని తేలడంతోపాటు మరింత జాగ్రత్తగా ఉండాలని వారిని హెచ్చరించి పంపేశారు.

ప్రజల స్పందనను బట్టి కార్యాచరణ ప్రణాళిక
రానున్న ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించడంవేరు.. టీడీపీ సిట్టింగ్ స్థానాల్లో విజయం సాధించడం వేరు అని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. వీటిల్లో వైసీపీకి పట్టు దొరికితే రాష్ట్రవ్యాప్తంగా పట్టు దొరికినట్లేనని, అధికారం సులువుగా చేజిక్కినట్లేననే భావనలో ఉన్నారు. అందుకు తగ్గట్లుగా కార్యాచరణ రూపొందించి క్షేత్రస్థాయిలో పనిచేయడానికి నాయకులను, కార్యకర్తలను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి పంపిస్తున్నారు. ఈ కార్యక్రమంద్వారా ప్రజల నుంచి వచ్చిన స్పందనను బేరీజు వేసుకొని మరోసారి ఈ 23 నియోజకవర్గాలకు సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తారు.












Click it and Unblock the Notifications