సారీ సార్.. మా ఇంట్లో పెళ్లి ఉంది.. అందుకే..!?
తెలుగుదేశం పార్టీది చాలా చిత్రమైన విషయం. ఈ పార్టీలో జరిగే వ్యవహారాలు కూడా అంతే చిత్రంగా ఉంటాయి. అందుకు అధినేత చంద్రబాబు అలుసా? లేదంటే ఆయన మొహమాటమా? లెక్కలేని తనమో తెలియదుకానీ పార్టీలోని నాయకులందరికీ చంద్రబాబు అంటే గౌరవం లేకుండా పోతోందంటూ కార్యకర్తలు మండిపడుతున్నారు. రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఆయన చెమటోడుస్తున్నారు.

రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి.. లేకపోతే రావు. టీడీపీ పరిస్థితి కూడా అంతే. చంద్రబాబు కష్టపడుతున్నారుకానీ నాయకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కర్నూలు జిల్లాలో తండోపతండాలుగా వచ్చిన ప్రజలను చూసి చంద్రబాబులో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది. అదే ఊపును ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా కొనసాగించాలని చంద్రబాబు అనుకుంటున్నారు. అనుకున్నదే తడవుగా ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం అమలుకు బయలుదేరారు. పెదవేగి మండలం విజయరాయిలో దీన్ని ప్రారంభించారు.

మా ఇంట్లో శుభకార్యాలున్నాయి సార్
అంతకుముందు ఆయనకు కలపర్రు టోల్ గేట్ వద్ద భారీ గజమాలతో పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. చింతలపూడి, దెందులూరు నియోజకవర్గాల్లో బాబు పర్యటన కొనసాగబోతోంది. 70 సంవత్సరాల వయసులో నాలుగు గంటల పాటు నిర్వహిస్తున్న రోడ్ షో, సభల్లో చంద్రబాబు నిలువు కాళ్ల పై నిలబడి ముందుకు సాగుతున్నారు. నేటి యువకులు ఒక గంట నిలబడమంటేనే నిలబడలేకపోతున్నారు. దీన్నిబట్టి పార్టీ కోసం ఆయన కష్టం ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. చిత్రమైన విషయం ఏమిటంటే ఆ విషయం ప్రజలకు అర్థమవుతుందికానీ నాయకులకు అర్థం కావడంలేదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలక నాయకులు తమకు ముఖ్యమైన పనులున్నాయిన, తమ ఇళ్లల్లో వచ్చే నెలలో శుభకార్యాలున్నాయని సమాచారం పంపించారు.

కావాలనే తప్పుకున్న నేతలు?
అంటే చంద్రబాబు టూర్ కు హాజరుకావడంలేదని అర్థం. మూడురోజులపాటు జరిగే బాబు కార్యక్రమానికి వీరంతా డుమ్మా కొట్టబోతున్నారు. ఈ విషయాన్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించారు. సారీ.. సార్ అన్నారు. ఎవరింట్లో పెళ్లికోసం తమ నేత ఈ కార్యక్రమ చేపడుతున్నారో ఈ నాయకులకే తెలియాలి. పార్టీని నమ్ముకొని ఎదిగి, సంపాదించి, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సహకరించని నాయకులు ఇలా వ్యవహరించవచ్చా? అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. ఎన్నికలకు ముందు జరుగుతున్న కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజాదరణతో విజయవంతమయ్యేలా చూడాల్సిన బాధ్యతల నుంచి సదరు నాయకులు కావాలనే తప్పుకుంటున్నట్లు అర్థమవుతోంది. దీంతో అనంతపురం జిల్లాకు చెందిన నేతలకు కబురు పంపించి గోదావరి జిల్లాలకు రప్పిస్తున్నట్లు సమాచారం. ఇటువంటి నేతలపై చంద్రబాబు భవిష్యత్తులో కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనపడుతోంది.