పొత్తులకు TDP రాంరాం!! ఒంటరి పోరుకు శ్రేణులను సిద్ధం చేస్తున్న అధినేత?
మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి అంటుంటారు పెద్దలు. అలా మారితేనే మన మనుగడ సాధ్యమవుతుంది. మనుషుల వ్యక్తిగత జీవితాల నుంచి వారికి సుపరిపాలన అందించే రాజకీయ పార్టీల వరకు అందరికీ ఇది వర్తిస్తుంది. కొద్దికాలంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న సంఘటనలు, వివిధ రాజకీయ పార్టీలు స్పందిస్తున్న తీరును దగ్గర నుంచి పరిశీలిస్తున్న తెలుగుదేశం పార్టీ తనను తాను పరిశీలించుకుంటూ సందర్భానుసారంగా మార్పుచేర్పులకు సిద్ధమవుతోంది. 2019 వరకు ఉన్న ఒకరకమైన ఆలోచనాతీరు నుంచి పక్కకు మళ్లుతోంది.

పరిణామాలన్నీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం?
రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను పరిశీలించిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. పొత్తుల గురించి ఆరాటపడే బదులు ఒంటరిగానే పోటీచేసి మన సత్తా నిరూపించుకుందాం అని. పార్టీ అగ్రనేతల నుంచి కార్యకర్తల వరకు అందరూ ఒంటరిగానే పోటీకి వెళతామంటూ ప్రకటనలిస్తున్నారు. మొన్నటివరకు జనసేన కూడా కలిసిరావాలి.. అందరూ కలిసి ప్రభుత్వంపై పోరాడదమని చంద్రబాబునాయుడు కూడా పిలుపునిచ్చారు. కానీ క్రమేణా పార్టీ ఆలోచనా తీరులో సంస్థాగతమైన మార్పు వస్తోందన్నది సుస్పష్టం.

ప్రజలు కావాలనుకుంటే పొత్తులున్నా ఒకటే? లేకున్నా ఒకటే?
కొన్నాళ్ల క్రితం జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలించిన తర్వాత టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు మాత్రం ప్రభుత్వాన్ని మార్చాలి అని నిర్ణయం తీసుకుంటే ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకొని వెళ్లినా ప్రయోజనముండదని తేలింది. ఇటువంటి పరిస్థితులు చోటుచేసుకుంటున్నప్పుడు పొత్తులపై అనవసరంగా మనల్ని మనం నష్టపరుచుకోవడం ఎందుకనే అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

త్యాగాలు చేయడం వృథాప్రయాస?
పొత్తులు అన్న తర్వాత కొన్ని త్యాగాలుంటాయి. సీట్లు వదులుకోవాలి. వారు మాట్లాడే మాటలను కూడా భరించాల్సి ఉంటుంది. సహకరిస్తారా? లేదా? అనే అనుమానం వెన్నాడుతూనే ఉంటుంది. ఇవన్నీ మనకు అనవసరం అనే అభిప్రాయంలో టీడీపీ నేతలున్నారు. కేంద్రంలో 2014లో బీజేపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీవల్లే ఏర్పడి జాతీయస్థాయిలో బలపడిందని, అయినా అవన్నీ మరిచిపోయి తమపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారనే విషయాన్నిగుర్తుచేస్తున్నారు. ఒకవేళ ప్రజలు తెలుగుదేశం పార్టీయే కావాలి.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి.. అనుకుంటే ఓట్లన్నీ కచ్చితంగా టీడీపీకే పడతాయని, దీనికోసం ఇతరుల నుంచి మాటలు అనిపించుకోవడం, త్యాగాలు చేయడం వృథాప్రయాస అనే అభిప్రాయానికి పార్టీ వచ్చిందని, ఇదే విషయాన్ని పార్టీ సీనియర్ నేతలు చంద్రబాబు దగ్గర ప్రస్తావించి ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. చివరకు బాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి మరి.!!