వద్దని చెప్పిన వారికే టికెట్: చిచ్చుపెట్టిన టీడీపీ జాబితా
TDP Janasena alliance: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన మధ్య ఎట్టకేలకు సీట్ల పంపకాల వ్యవహారం తేలింది. 118 మంది అభ్యర్థులతో కూడిన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.
ఈ జాబితా అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో చిచ్చుపెట్టింది. వర్గ విభేదాలు తలెత్తాయి. టీడీపీ నాయకుల్లో అసంతృప్తి చెలరేగింది. చంద్రబాబు, నారా లోకేష్, ఇతర జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల బొమ్మలను ముద్రించి వున్న బ్యానర్లు, ఫ్లెక్సీలను చించివేశారు. కొన్నింటిని తగులబెట్టారు.

తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉంటూ వస్తోన్న ఈ జిల్లాలో ఈ స్థాయిలో విభేదాలు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని ప్రభావం ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపోటములపై పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
ప్రత్యేకించి- కల్యాణదుర్గం నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఇన్‌ఛార్జ్ మాదినేని ఉమా మహేశ్వర నాయుడు.. ఈ జాబితాపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోన్నారు. కల్యాణదుర్గం టికెట్‌ను ప్రముఖ కాంట్రాక్టర్, ఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్ అధినేత అమిలినేని సురేందర్ బాబుకు కేటాయించారు చంద్రబాబు.

సీనియర్ నేతలు ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఉమా మహేశ్వర నాయుడులను కాదని ఓ కాంట్రాక్టర్‌కు టికెట్ ఇవ్వడం పట్ల మండిపడుతున్నారు. అమిలినేని సురేందర్ బాబుకు టికెట్ ఇవ్వొద్దని, తామిద్దరిలో ఎవరికి ఇచ్చినా.. పార్టీ గెలుపు కోసం పని చేస్తామంటూ ఇటీవలే చంద్రబాబుకు లేఖ సైతం రాశారు.
అయినప్పటికీ- చంద్రబాబు దీనిపై ఖాతరు చేయలేదు. ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఉమా మహేశ్వర నాయుడు ఎవరికి టికెట్ ఇవ్వొద్దంటూ రాశారో.. ఆయనకే ఖరారు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు పార్టీ నాయకులు. పార్టీ కార్యాలయంలో ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించారు. సురేందర్ బాబు ఎలా గెలుస్తాడో చూస్తామంటూ సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications