రేపటి పెన్షన్ల పంపిణీపై టీడీపీ అధిష్టానం కీలక సూచన..!
రాష్ట్రంలో నాలుగు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన దాని కంటే ఎక్కువగా పెన్షన్ ఇస్తోంది. అయితే దీనికి తగిన ప్రచారం మాత్రం లభించడం లేదనే అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలో నేతలు, కార్యకర్తలకు మరోసారి అధిష్టానం కీలక సూచనలు చేసింది. రేపు అక్టోబర్ 1న పెన్షన్ల పంపిణీ సందర్భంగా ఏం చేయాలో వారికి సూచించింది.
ఆక్టోబర్ 1వ తేదీన జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నాయకులు అందరూ సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. మండల, టౌన్ పార్టీ అధ్యక్షులు, డివిజన్, వార్డు అధ్యక్షులు , క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ ఇన్‌చార్జ్‌లు, అబ్జర్వర్ ఇతర అన్ని పార్టీ పదవుల్లో ఉన్న నాయకులు అంతా ఇందులో పాల్గొనాల్సిందేనని ఆదేశించింది. వీరంతా తమ స్థానిక సచివాలయం పరిధిలోని ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని సూచించింది.

అలాగే స్థానిక మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పార్లమెంట్ అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లు తమ నియోజకవర్గంలోని అన్ని ఏరియాలలో కవర్ అయ్యే విధంగా లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేయాలని అధిష్టానం ఆదేశాలు ఇస్తోంది. దీంతో పాటు వీరంతా ఇలా పెన్షన్లు పంపిణీ చేస్తున్న ఫొటోల్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో షేర్ చేయాలని కూడా కోరింది. ఈ విషయంలో ఇప్పటికే నేతలు నిర్లిప్తంగా ఉంటున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications