జగన్ మా ఇల్లు ఆక్రమించుకోలేదు! జరిగిందిదే..! టీడీపీ నేత క్లారిటీ..!
ఏపీలో 2019 ఎన్నికలకు ముందు అప్పటి విపక్ష నేత వైఎస్ జగన్ గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ నివాసం నిర్మాణం చేయించుకున్నారు. అనంతరం దానిలోనే తన ఇంటితో పాటు క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు. అధికారంలోకి వచ్చాక అదే సీఎం క్యాంపు కార్యాలయంగా మారింది. ఎవరో కట్టిన ఈ ఇంటిని జగన్ అక్రమించుకున్నారనే ప్రచారం ఈ మధ్య సోషల్ మీడియాలో జరుగుతుండటంతో దాని బిల్డర్ అయిన టీడీపీ నేత, టాలీవుడ్ నిర్మాత స్పందించారు.
వైఎస్ జగన్ తాడేపల్లిలో తాము నిర్మించుకున్న భవనాల్ని ఆక్రమించుకున్నట్లు జరుగుతున్న ప్రచారంపై టాలీవుడ్ నిర్మాత, టీడీపీ నేత ఆదిశేషగిరిరావు స్పందించారు. అలాంటిదేమీ లేదన్నారు. తన కుమారుడు నిర్మించిన విల్లాల్లో ఒకటైన తాడేపల్లి నివాసాన్ని జగన్ అధికారికంగా డబ్బులిచ్చి కొనుగోలు చేశారన్నారు. కాబట్టి దీనిపై జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవం అని ఆదిశేషగిరిరావు క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు అప్పట్లో ఏం జరిగిందో వెల్లడించారు.

తాడేపల్లిలో తమ కుమారుడు నిర్మించిన విల్లాల్లో జగన్ ఇల్లు, ఆఫీసు ఓ భాగమని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆదిశేషగిరిరావు వెల్లడించారు. ఆ సైట్ చూసింది, నిర్మించిందీ తామేనని, అయితే మార్కెట్ రేటు ప్రకారం జగన్ తమ వద్ద నుంచి దీన్ని కొనుగోలు చేసినట్లు ఆదిశేషగిరిరావు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన నిర్మాణ బిల్లులన్నీ ఇచ్చేశారన్నారు. కాబట్టి జగన్ తమ భవనాల్ని ఆక్రమించుకున్నట్లు జరుగుతున్న ప్రచారం తప్పని స్పష్టం చేశారు.
వాస్తవానికి 2019కి ముందు వైసీపీలో ఉన్న ఆదిశేషగిరిరావు.. జగన్ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీతో పొసగక టీడీపీలోకి వెళ్లిపోయారు. జగన్ పార్టీ నడిపే విధానంతో విభేదించి టీడీపీలో చేరినట్లు ఆయన తెలిపారు. వైసీపీలో ఉండగా జగన్ పాదయాత్ర నుంచి పార్టీ నిర్మాణం వరకూ పలు అంశాల్లో తాను క్రియాశీలకంగా ఉన్నట్లు కూడా తెలిపారు. రాజకీయ పార్టీ నిర్వహణలో డిక్టెటోరియల్ ఆటిట్యూడ్ ఉండకూడదని అన్నారు. జగన్ తన ఐదేళ్ల పాలనతో కేడర్‌ను పట్టించుకోలేదని అన్నాడు. కేడర్‌ను పట్టించుకోకపోవడం ఏ పార్టీకీ మంచిది కాదని అన్నారు.












Click it and Unblock the Notifications