కడప జిల్లాలో టిడిపి నేత హత్యతో రాజకీయ రణం...ప్రొద్దుటూరు నుండి లోకేష్ పోటీ చెయ్యాలని ఎమ్మెల్యే రాచమల్లు సవాల్
కడప జిల్లాలో టిడిపి నేత సుబ్బయ్య హత్యతో రాజకీయ రణం మొదలైంది . ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది బంగారు రెడ్డి టీడీపీ నేత సుబ్బయ్య హత్యకు కారణమని టిడిపి ఆరోపిస్తోంది. సుబ్బయ్య భార్య అపరాజితతో పాటుగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా వైసీపీ నేతలే హత్యకు కారణమని మండిపడుతున్నారు.ఇక ఈ నేపధ్యంలో వైసీపీ ఎమ్మెల్యే నారా లోకేష్ కు సంచలన సవాల్ ను చేశారు.
టీడీపీ నేత హత్యపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సంచలనం .. చౌడేశ్వరీ ఆలయంలో సత్య ప్రమాణం

లోకేష్ ప్రొద్దుటూరు నుండి తనపై పోటీ చేసి గెలవాలని సవాల్
టిడిపి నేత సుబ్బయ్య హత్యకు వైసిపి ఎమ్మెల్యే కారణమంటూ చేసిన వ్యాఖ్యలపై , అతని పేరుమీద ఎఫ్ ఐ ఆర్ చేయాలని చేసిన డిమాండ్ పై వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. నియోజకవర్గం నుండి నారా లోకేష్ పోటీ చేయాలని లోకేష్ ప్రొద్దుటూరు నుంచి పోటీ చేస్తానంటే రాజీనామా చేస్తారంటూ ప్రకటించారు. తనపై పోటీ చేసి లోకేష్ గెలిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల వదిలేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి.

హత్యపై ప్రజాభిప్రాయం కోరదాం .. పోటీ చేస్తానంటే రాజీనామా చేస్తా
నేను టిడిపి నేత సుబ్బయ్య ను హత్య చేయించానని, హత్య చేసేందుకు ప్రోత్సహించానని నువ్వు నమ్మితే నీకు సవాల్ విసురుతున్నా అంటూ పేర్కొన్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఈ హత్య అంశంపై పొద్దుటూరు ప్రజల అభిప్రాయం సేకరిద్దాం . నువ్వు ఇక్కడ పోటీ చేస్తానంటే నేను రాజీనామా చేస్తా.. పోటీలో పాల్గొందామంటూ పేర్కొన్నారు. టిడిపి నేత సుబ్బయ్య ను ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి హత్య చేశాడని, అతనిని ఓడించాలని మీరు ప్రజల్లోకి వెళ్లండి. నేను కూడా ఈ హత్యతో నాకు సంబంధం లేదని ప్రజలు ఓటు వేయాలని కోరతానన్నారు.

ఒకవేళ ఓడిపోతే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా
ఒకవేళ నేను ఓటమి పాలైతే ఆ మరుక్షణమే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా... ఊరు వదిలి వెళ్లిపోతాను అంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి నారా లోకేష్ కు చాలెంజ్ విసిరారు. ఇప్పటికే ఆయన టిడిపి నేత హత్యతో తనకు ఎలాంటి ప్రమేయం లేదని ప్రొద్దుటూరు చౌడేశ్వరి ఆలయంలో సత్య ప్రమాణం కూడా చేశారు.
ఇదే సమయంలో మృతుడు సుబ్బయ్య భార్య కూడా తన పిల్లల మీద ప్రమాణం చేసి ఎమ్మెల్యే పై , ఎమ్మెల్యే బావమరిది బంగారు రెడ్డిపై ఆరోపణలు చేశారు .