నయీంతో సంబంధాల్లేవు: మీడియాపై కర్నూలు టిడిపి నేత ఫైర్
హైదరాబాద్/కర్నూలు: తెలంగాణ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్‌తో పలువురు పోలీసు అధికారులు, వ్యాపారులు, రాజకీయ నేతలకు సంబంధాలున్నాయంటూ వస్తున్న వార్తలు తెలుగు రాష్ట్రాల్లో పెను కలకలమే రేపుతోంది. ఇప్పటికే పలువురు తమకు నయీమ్ తో ఎలాంటి సంబంధాల్లేవని స్పష్టం చేశారు.
ఇటీవల ఉమ్మడి రాష్ట్రానికి మాజీ డీజీపీగా పనిచేసిన రిటైర్డ్ ఐపీఎస్ దినేశ్ రెడ్డి నేరుగా మీడియా ముందుకు వచ్చారు. తనతో పాటు ఏ ఒక్క మాజీ డీజీపీకి నయీమ్ తో సంబంధాలు లేవని ఆయన తేల్చి చెప్పారు.
తాజాగా ఉమ్మడి రాష్ట్రంలో నాన్ కేడర్ ఎస్పీగా పనిచేసి ఆ తర్వాత రాజకీయ తెరంగేట్రం చేసిన టీడీపీ నేత, కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ ఇన్‌చార్జీ శివానందరెడ్డి బుధవారం మీడియా ముందుకు వచ్చారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ నిన్న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

నిజానిజాలు తెలుసుకోకుండా వార్తలు ప్రచురించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్-1 అధికారిగా ఎన్నికైన తాను 2000 నుంచి మూడేళ్ల పాటు నల్గొండ జిల్లాలో అదనపు ఎస్పీగా పనిచేసిన మాట వాస్తవమేనని శివానందరెడ్డి పేర్కొన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు శివధర్ రెడ్డి, వీసీ సజ్జన్నార్ లు ఎస్పీలుగా పనిచేసిన ఆ కాలంలో నయీమ్ పేరు ఎక్కడా వినిపించలేదన్నారు.
నక్సలైట్ల సమాచారం కోసం మాజీ నక్సల్స్ సహాయం తీసుకోవడం పోలీసు శాఖలో సర్వసాధారణమని ఆయన చెప్పారు. పోలీసు శాఖలోని ఒకటి, రెండు శాతం మంది నయీమ్ లాంటి వ్యక్తులతో అంటకాగినంతమాత్రాన... అందరికీ ఆ పాపాన్ని అంటగట్టడాన్ని మీడియా ఇకనైనా మానుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications