టీడీపీ నేత సుబ్బయ్య హత్య: ఎమ్మెల్యే హస్తముందంటూ అపరాజిత
కడప: తెలుగుదేశం పార్టీ నేత సుబ్బయ్య హత్య ఘటనపై ఆయన సతీమణి అపరాజిత స్పందించారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే స్థలంలోనే జరిగిన ఈ హత్య వెనక ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది ఉన్నారని ఆరోపించారు. మంగళవారం ఉదయం నుంచి కొంతమంది తమ ఇంటి చుట్టూ తిరిగారని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు న్యాయ చేయాలని, ఎక్కడికైనా వచ్చి మాట్లాడేందుకు తాను సిద్ధమేనని అపరాజిత అన్నారు. అసలైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరులో టీడీపీ నేత సుబ్బయ్య దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.

సోమలవారిపల్లి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఇళ్ల స్థలాల ప్లాట్ల వద్ద దుండగులు అత్యంత కిరాతకంగా కళ్లల్లో కారం కొట్టి నరికి చంపారు. మారణాయుధాలతో దాడి చేయడంతో సుబ్బయ్య తల ఛిద్రమైంది. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధిగా వ్యవహరించిన సుబ్బయ్య రాజకీయంగా విమర్శలు చేస్తూ ఇటీవల సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టారు.
ప్రత్యర్థి నేతలు ఆయనపై ప్రతి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే సుబ్బయ్య హత్య జరగడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన స్థానికంగానే గాక, రాష్ట్రం వ్యాప్తంగా కలకలం సృష్టించింది. కాగా, సుబ్బయ్య హత్య కేసులో లొంగిపోయిన నలుగురు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications