వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఏపీలో ఏ స్థానంలో గెలుస్తుందో చెప్పండి: కన్నాకు టీడీపీ నేతలు
అమరావతి: వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఏపీలో ఏ స్థానంలో గెలుస్తుందో ఆ పార్టీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ చెప్పగలరా అని టీడీపీ ఏపీ చీఫ్ కళా వెంకట్రావు సోమవారం ప్రశ్నించారు. టీడీపీని కన్నా విమర్శించడంపై ఆయన మండిపడ్డారు. విమర్శలు చేస్తేనే రాజకీయాలని కన్నా భావిస్తున్నారని, ఏపీ ప్రయోజనాల కోసం పాటుపడాల్సిందిపోయి తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఎవరి ప్రయోజనాల కోసం ధర్నాలు, ఇంటింటికీ తిరిగే కార్యక్రమాలను బీజేపీ చేపడుతోందని ప్రశ్నించారు. అర్థంలేని ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు ఏం సాధిస్తారన్నారు. విభజన హామీలు నెరవేర్చలేదని ప్రశ్నిస్తున్న తమపైనే కన్నా విమర్శలు చేయడం తగదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి రేటు 10.5 శాతం ఉంటే దేశంలో బీజేపీ సాధించింది 7.5 శాతం మాత్రమే అన్నారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలన్నారు.

బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని మంత్రి కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. బీసీలకు ఒక్క పదవి ఇవ్వని జగన్ వారిని ఉద్దరిస్తారా అని విమర్శించారు. పీఏసీ చైర్మన్, రాజ్యసభ స్థానాలు బీసీలకు ఇవ్వలేదన్నారు. ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. బీసీలకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే వైసీపీ బురద జల్లిందన్నారు.
టీడీపీపై బీజేపీ అసత్య ప్రచారాలు చేస్తోందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. తమదీ బీజేపీకి కౌంటర్ ధర్నా కాదన్నారు. (బీజేపీ-టీడీపీలో పోటాపోటీగా ధర్నాలు చేశాయి.) బీజేపీ నేతలకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని చెప్పారు. తాను వచ్చే ఎన్నికల్లో ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణపై పోటీ చేస్తానని, ఆయన గెలిస్తే గుండు కొట్టించుకుంటానని సవాల్ చేశారు. తమ అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికే కన్నా, పురంధేశ్వరిలు బీజేపీలో చేరారని ఆరోపించారు.
తాము బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications