
జగనన్న గుంతల పథకం, అచ్చెన్న వ్యంగ్యం .. రోడ్లపై వలలతో చేపలు పట్టి నిమ్మల ఆగ్రహం, దేవినేని ధ్వజం !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై టిడిపి నేతలు సమర శంఖం పూరించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు జలమయం కావడంతో, గుంతల రోడ్లపై ప్రయాణం చెయ్యాలంటే ప్రజలు భయపడుతున్నారు అంటూ, వైసీపీ పాలనలో రోడ్ల దుస్థితికి నిరసనగా టిడిపి నేతలు జగన్ సర్కార్ పాలనను టార్గెట్ చేశారు.

రాష్ట్రంలోని రోడ్లు అవినీతికి ప్రతిరూపాలుగా : అచ్చెన్న
ఈరోజు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాష్ట్రంలో జగనన్న గుంతల పథకం వల్ల రోడ్ ఎక్కాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు అని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని రోడ్లు అవినీతికి ప్రతిరూపాలుగా ఉన్నాయని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. రెండేళ్లుగా రోడ్లకు మరమ్మతులు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదా అంటూ ప్రశ్నించిన అచ్చెన్న ప్రజలు గమ్యస్థానానికి చేరడానికి ముందే పోయేలా ఉన్నారని ఎద్దేవా చేశారు.

రోడ్లపై ప్రజలు పడవల్లో తిరిగే దుస్థితి : అచ్చెన్నాయుడు
రాష్ట్రంలోని రహదారులు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి అని ఆరోపించిన ఆయన, ప్రజలు రోడ్లపై పడవల్లో తిరిగే పరిస్థితి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ అవినీతి మత్తులో తేలుతూ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. రోడ్ల మరమ్మతుల కోసం రాష్ట్రంలో వెంటనే బడ్జెట్ విడుదల చేయాలని, రెండేళ్ల పాలనలో రోడ్లపై ఖర్చు చేసిన సొమ్ము కు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని అచ్చెన్నాయుడు జగన్ సర్కార్ ను డిమాండ్ చేశారు.

రోడ్లపై వలలతో చేపలు పట్టిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై పాలకొల్లు ఎమ్మెల్యే, టిడిపి నేత నిమ్మల రామానాయుడు వినూత్న రీతిలో తన నిరసనను తెలియజేశారు. రోడ్లమీద వలలతో చేపలు పట్టి నిరసన తెలియ చేసిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు జగన్ పాలనలో రోడ్లు జలాశయాల్లా తయారయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్వాన్నమైన రోడ్లపై ప్రజలు ప్రయాణం చెయ్యలేకపోతున్నారని మండిపడ్డారు. పాలకొల్లు మండలం దుగ్గలూరు పాలమూరు రోడ్డుపై నిమ్మల తన నిరసనను వ్యక్తం చేశారు.

రోడ్ల దుస్థితి మీ ప్రభుత్వ పరిపాలనకు అద్దం పడుతుంది జగన్ .. దేవినేని ఉమా ధ్వజం
మాజీమంత్రి టీడీపీ నేత దేవినేని ఉమా సైతం రాష్ట్రంలో రోడ్ల దుస్థితి పై విరుచుకుపడ్డారు. ఏపీలో రోడ్లపై ప్రయాణం చేయాలంటే ప్రజలు భయపడుతున్నారని దేవినేని ఉమా పేర్కొన్నారు. గుంతల మయమై చెరువులను తలపిస్తున్న రోడ్ ల దుస్థితి వైసిపి ప్రభుత్వ పాలనకు అద్దం పడుతుంది అన్నారు. 27 నెలలుగా రాష్ట్రంలో కొత్త రోడ్లు ఊసే లేదని పాత వాటికి మరమ్మతులు లేవని ఆరోపించారు. ప్రభుత్వ తీరుతో కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదని పేర్కొన్న దేవినేని ఉమా రాష్ట్రంలో రోడ్ల దుస్థితి మీ ప్రభుత్వ పరిపాలనకు అద్దం పడుతుంది అన్న మాట వాస్తవం కాదా అంటూ వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.