ఏపీలో పెన్షన్ల పంపిణీలో టీడీపీ! నేతలకు కీలక ఆదేశాలు..?
ఏపీలో ఎల్లుండి సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రారంభం కాబోతోంది. జూలై 1న పెరిగిన పెన్షన్లను పంపిణీ చేసేందుకు సచివాలయ సిబ్బందికి ఆదేశాలు వెళ్లాయి. గతంలో వాలంటీర్లతో పంపిణీ చేయించిన పెన్షన్లను కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బందితో ఇప్పించబోతోంది. అంతే కాదు తొలిసారి పెరిగిన మొత్తంతో పంపిణీ చేయబోతున్న పెన్షన్ల విషయంలో అధికార టీడీపీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
జూలై 1వ తేదీన జరిగే పెన్షన్ల పంపిణీలో ప్రతి నాయకుడు పాల్గొనాలని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. జూలై 1వ తేదీన జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి నాయకుడు సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనాలని తెలిపారు. మండల, టౌన్ పార్టీ అధ్యక్షులు, డివిజన్, వార్డు అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ ఇన్‌చార్జ్‌లు, ఇతర పదవుల్లో ఉన్న నాయకులు ఆయా సచివాలయం పరిధిలో ఇంటింటికీ వెళ్ళీ పెన్షన్లు పంపిణీ చేయాలని సూచించారు.

స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఇన్‌చార్జ్, పార్లమెంట్ అధ్యక్షులు నియోజకవర్గంలోని అన్ని ఏరియాలలో కవర్ అయ్యే విధంగా కనీసం 10 లబ్ధిదారులకు పైగా పెన్షన్లను పంపిణీ చేసి సోషల్, మీడియాలో వచ్చేటట్లు చూడాలని కోరినట్లు తెలుస్తోంది. ఆ రోజు మొత్తం నాయకులందరూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంపైనే ఉండాలని కూడా సూచించారు. ఈసారి పెరిగిన పెన్షన్లు ఇస్తుండటం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి ఇస్తున్న పెన్షన్లను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే పార్టీ నేతలు దగ్గరుండి వీటిని పంపిణీ చేయించాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications