వీడియో: బండారు శ్రావణికి తీవ్ర అనారోగ్యం: సెలైన్ బాటిల్
Bandaru Sravani: ఏపీలో రోజురోజుకూ ఎండ తీవ్రత అధికమౌతోంది. ఎక్కడే గానీ తగ్గుముఖం పట్టేలా కనిపించట్లేదు. గతంలో ఎప్పుడూ లేనంతగా గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతోంది. 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత సర్వ సాధారణం అయింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
నడి వేసవిలో రోళ్లు పగిలేలా ఎండలు కాస్తోన్నాయి. ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని జిల్లాల్లో సగటున 44 డిగ్రీల మేర గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతోంది.

రోజురోజుకూ పెరుగుతున్న ఎండలకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం.. అభ్యర్థులకు గండంగా మారింది. నియోజకవర్గం పరిధిలో ప్రతి గ్రామానికీ వెళ్లాల్సి రావడం, ఇంటింటి ప్రచారం చేపట్టడం సవాల్‌గా మారింది. అయినప్పటికీ- పోలింగ్ గడువు సమీపిస్తోండటంతో ఎండ తీవ్రతను లెక్క చేయట్లేదు.
ఈ పరిస్థితుల్లో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు శ్రావణి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆమె వడదెబ్బకు గురైనట్లు డాక్టర్లు వెల్లడించారు. డీహైడ్రేషన్ బారిన పడినట్లు చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచీ బండారు శ్రావణి ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటూ వస్తోన్నారు.
అనంతపురంలో నమోదవుతున్న రికార్డుస్థాయి ఉష్ణోగ్రతను లెక్కచేయట్లేదు. విరామం లేకుండా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోన్నారు. ఈ క్రమంలో ఈ ఉదయం బండారు శ్రావణి వడదెబ్బకు గురయ్యారు. ఇంట్లోనే చికిత్స తీసుకుంటోన్నారు. ఈ విషయం తెలియడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆమెను పరామర్శిస్తోన్నారు.
అనంతపురంతో పాటు శ్రీసత్యసాయి పుట్టపర్తి, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, అనకాపల్లి, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, నెల్లూరు, కాకినాడ వంటి జిల్లాల్లో శనివారం నాడు 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత రికార్డయిన విషయం తెలిసిందే. ఆయా జిల్లాల్లోని పలు మండలాల్లో వడగాల్పులు వీచాయి.












Click it and Unblock the Notifications