భోగి మంటల్లో జీవో కాపీలు.. నిరసనల భోగి: గద్దె రామ్మోహన్, కేశినేని శ్వేత..
భోగి పండుగ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పార్టీ కార్యాలయంలో భోగి మంటలు వేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన 196, 197, 198 జీవో కాపీలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. కేశినేని శ్వేత, దేవినేని అపర్ణ కూడా పాల్గొన్నారు. పన్నుల భారాలను వ్యతిరేకిస్తూ నిరసన భోగిగా నిర్వహించామని తెలిపారు. పేదల ప్రభుత్వం అని చెప్పే సీఎం జగన్.. వారిపై భారాలు మోపుతున్నారని మండిపడ్డారు. రిజిస్ట్రేషన్ విలువను ఇష్టానుసారంగా పెంచేశారన్నారు. ఆస్తి విలువ పదిహేను శాతం అని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

జగన్ మనసు మారాలని..
0.1 శాతం పెరిగినా పన్నులు రెట్టింపు చెల్లించాలని తెలిపారు. మధ్యతరగతి ప్రజలు ఆస్తి, నీటి, డ్రెనేజీ పన్నుల భారం భారీగా పడుతుందన్నారు. ప్రభుత్వం పది రూపాయలు ఇచ్చి... వంద రూపాయలు వసూలు చేస్తుందని మండిపడ్డారు. భోగి మంటల ద్వారా జగన్ మనసు మారి.. జీఒలను రద్దు చేయాలని గద్దె రామ్మోహన్ డిమాండ్ చేశారు.

అసంతృప్తి..
వైసీపీ పాలనపై అన్ని వర్గాల వారు అసంతప్తిగా ఉన్నారని కేశినేని శ్వేత అన్నారు. రైతుల ధాన్యం కొనుగోలు చేసేవారు లేక ఆవేదన చెందుతున్నారని తెలిపారు. పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడం లేదని మండిపడ్డారు. వైసీపీ మంత్రుల ప్రకటనలకు, ఆచరణకు సంబందం లేదన్నారు. ఉత్సాహంతో జరుపుకోవాల్సిన సంక్రాంతి.. కర్షకులకు కష్టాలను మిగిల్చారని తెలిపారు. పట్టణ ప్రజలపై పన్నుల భారాలు మోపారని.. అందుకే నిరసన భోగి నిర్వహించామని చెప్పారు.

ప్రజల ఇబ్బందులు
జగన్ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని దేవినేని అపర్ణ అన్నారు. ఇప్పుడు కొత్తగా పన్నుల భారాలను రెట్టింపు చేయడం సరి కాదన్నారు. రాజధాని లేక, పెట్టుబడులు రాక.. అన్ని విధాలా నష్టపోయిందన్నారు. సీఎం తన నిర్ణయాన్ని మార్చుకుని ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

భోగి పండుగ అంటే..
భోగి పండుగ తెలుగువారు జరుపుకునే ముఖ్యః పండుగ. మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును భోగి అంటారు. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవుట వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు అందరు వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది.