కాపులు చిన్న కమ్మోళ్లు..! టీడీపీ ఎమ్మెల్యే వసంత షాకింగ్ కామెంట్స్..!
ఏపీ రాజకీయాల్లో ముక్కుసూటిగా మాట్లాడతారని పేరున్న మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు, ప్రస్తుత టీడీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలే సామాజిక వర్గాల పోరుతో సతమతం అయ్యే రాష్ట్రంలో రెండు సామాజిక వర్గాల గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో తన సొంత సామాజిక వర్గం కూడా ఉంది. దీంతో వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఇవాళ తన సొంత నియోజకవర్గం మైలవరంలో నిర్వహించిన కాపు సంఘం సమావేశానికి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాపు సామాజికవర్గాన్ని ఉద్దేశించి వసంత కీలక వ్యాఖ్యలు చేశారు. తన చిన్నతనంలో చిన్న కమ్మ వాళ్లు అంటే కాపులు అన్నారు. పెద్ద కమ్మ వాళ్లు అంటే అసలైన కమ్మ వాళ్లు అనే వాళ్లని గుర్తుచేసుకున్నారు. పొలాలు తక్కువ ఉన్న వాళ్లని కాపులు అని, పొలాలు ఎక్కువ ఉన్న వాళ్లని కమ్మలు అని పిలిచే వాళ్లన్నారు.

ఇదొక్కటే తప్ప కమ్మ, కాపు సామాజిక వర్గాలకు వ్యత్యాసం ఏమీ లేదని, తరతరాలుగా అన్నదమ్ములుగా కలిసి ఉన్నామంటూ వసంత కృష్ణప్రసాద్ చెప్పుకొచ్చారు. కానీ మధ్యలో కొన్ని రాజకీయాలు దూరం చేశాయన్నారు. కానీ ఇప్పుడు మన బిడ్డల్ని కలిసి ముందుకు నడిపించి జాతి నిర్మాణంలో పాలు పంచుకోవడం మనందరి బాధ్యత అన్నారు. అదే సభలో పాల్గొన్న జనసేన నేత సామినేని ఉదయభానును ఉద్దేశించి వసంత కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే ఆలస్యమైందని, జనసేన నేత అయిన సామినేని ఉదయభాను రాబోయే ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లా నుంచి ఎమ్మెల్యే కావడం ఖాయమని వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. వందకు వందశాతం మంత్రి కావడం కూడా ఖాయమన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఉదయభాను గతంలో వైఎస్ కుటుంబ అభిమానిగా ఉన్నారు. కాంగ్రెస్, వైసీపీల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆయన గతేడాది జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పవన్ ఆయనకు ఎన్టీఆర్ జిల్లా జనసేన పగ్గాలు అప్పగించారు. నియోజకవర్గాల పునర్విభజనలో ఉదయభానుకు జిల్లాలో సీటు కేటాయించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications