లెక్చరొద్దు: సీఎం రమేష్‌కు సభలో చురకలు
న్యూఢిల్లీ: లెక్చర్ ఇవ్వవద్దని, ఏమైనా అడగాలనుకుంటే అడగాలని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు రాజ్యసభ ఉపాధ్యక్షులు కురియన్ చురకలు అంటించారు. ఈ సంఘటన గురువారం జరిగింది. శేషాచలం ఎన్‌కౌంటర్‌లో ఇరవై మంది తమిళులు మరణించిన అంశంపై రాజ్యసభలో చర్చ జరిగింది.
ఈ అంశంపై మొదట మాట్లాడేందుకు సీఎం రమేశ్ నిరాకరించారు. సభ్యులందరు మాట్లాడిన అనంతరం హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమాధానం చెప్పేముందు మాట్లాడుతానన్నారు. సభ్యులందరు మాట్లాడిన అనంతరం సీఎం రమేశ్ మాట్లాడుతూ... తెలుగు, తమిళ ప్రజలు సోదరుల వంటివారు, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవు, ఎన్టీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెన్నైకి తెలుగుగంగ నీరు కేటాయించారని చెబుతున్నారు.

దీనికి తమిళనాడుకు చెందిన పలువురు సభ్యులు తీవ్రంగా స్పందించారు. సీపీఐ సభ్యుడు ఏ రాజా మాట్లాడుతూ.. తెలుగు, తమిళ ప్రజల మధ్య విభేదాలు పొడసూపాయని తామెవ్వరం చెప్పటం లేదని, రెండు రాష్ట్రాల ప్రజలు సోదరులనే విషయాన్ని తామెవ్వరం ఖండించటం లేదని, ఈ అంశాలను ఎందుకు ప్రస్తావిస్తున్నారని అడిగారు.
దీనిపై కాసేపు సభ్యుల మధ్య చర్చ జరిగింది. అనంతరం సీఎం రమేష్ మాట్లాడుతూ.. ఎంపీలు ప్రస్తావించిన అంశాలకు జవాబు చెప్పాలి కదా అన్నారు. దీనికి కురియన్ స్పందిస్తూ.. మీకు సంబంధం లేని అంశాల గురించి మాట్లాడవద్దని చురకలు అంటించారు. టీడీపీ సభ్యురాలు గుండు సుధారాణి జోక్యం చేసుకుని తమ సభ్యుడు రమేష్‌ను మాట్లాడనివ్వాలని కోరారు. కానీ రమేష్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications