కేంద్రానికి ఆ భయం పట్టుకుంది, అందుకే ఇలా: టీడీపీ ఎంపీలు
న్యూఢిల్లీ: ఏపీ టీడీపీ ఎంపీలు పార్లమెంటులో నిరసనలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రానికి న్యాయం జరిరిగే వరకు తమ ఆందోళన కొనసాగుతోందని స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిపేందుకు కేంద్రం భయపడుతోందని టీడీపీ ఎంపీలు ఆరోపించారు.

భయంతోనే బీజేపీ
లోకసభ వాయిదా పడిన అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ.. అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వం పడిపోతుందన్న భయంతోనే బీజేపీ అడ్డుకుంటోందని అన్నారు. పార్లమెంటు చరిత్రలోనే దీన్ని చీకటి కోణంగా పేర్కొనవచ్చని అన్నారు.

అవిశ్వాస తీర్మానం మళ్లీ
ఈ అంశంపై రాష్ట్రపతి కలుగజేసుకుని పార్లమెంటు ఉభయసభలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పార్లమెంటులో జరుగుతున్న అప్రజాస్వామిక విధానాలను రాష్ట్రపతికి నివేదిస్తామని తెలిపారు. మంగళశారం అవిశ్వాసం జరగనందున రేపటి(బుధవారం) కోసం అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ కార్యాలయంలో అందజేసినట్లు తెలిపారు.

బీజేపీకి అదే భయం
అవిశ్వాస తీర్మానంలో భాగంగా రహస్య ఓటింగ్ పెడితే సొంత పార్టీలోనే చాలామంది వ్యతిరేకంగా ఓటేస్తామరేమోనన్న భయం బీజేపీలో నెలకొని ఉందని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. మోడీ ఒంటెద్దు పోకడలకు సొంత పార్టీ ఎంపీలే విసిగిపోయారని అన్నారు.

అవిశ్వాసంపై ఎందుకిలా?
ఇరాక్‌లో భారతీయుల హత్యకు సంబంధించి సుష్మా స్వరాజ్ ప్రకటన చేసే సమయంలో ఆందోళన చేయొద్దని బీజేపీ విప్ పలు పార్టీల సభ్యుల వద్దకు వెళ్లి కోరారని.. అదే తరహాలో అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టేందుకు కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎంపీలు ప్రశ్నించారు. అన్నాడీఎంకే, టీఆర్ఎస్, ఇతర పార్టీల ఎంపీల ఆందోళనలతో పార్లమెంటు రేపటికి వాయిదాపడ్డ విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications