జాతీయ పార్టీ: రెండుప్రాంతాల్లో బాబే! టి పునర్నిర్మాణంపై
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు అవసరమైన ప్రక్రియకు పార్టీ నాయకత్వం త్వరలోనే శ్రీకారం చుట్టనుంది. బుధవారం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పార్టీకి చెందిన ఇరు ప్రాంతాల నేతలతో భేటీ అయ్యారు. టిడిపిని జాతీయ పార్టీగా ప్రకటించే అంశంపై చర్చించారు. విభజన తర్వాత తెలంగాణలో, సీమాంధ్రలో పార్టీ ఉంటుంది కాబట్టి జాతీయ పార్టీగా ప్రకటించాలని భావిస్తున్నారు.
తెలంగాణను అభివృద్ధి చేసింది తామేనని, చేయబోయేది తామేనని, తెలంగాణ పునర్నిర్మాణం టిడిపితోనే సాధ్యమని, ఇదే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని, అభివృద్ధి విషయంలో ప్రజల్లో విశ్వసనీయత ఉందని, చేసిన పనులకు సాక్ష్యం ఉందని, తెలంగాణలో బడుగు బలహీనవర్గాలు పార్టీతోనే ఉన్నారని, రెండు చోట్లా టిడిపియే గెలుస్తుందని చంద్రబాబు నేతల భేటీలో వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో టిటిడిపి పాల్గొందని, జెఏసిల్లో కీలకంగా పని చేశారని, ఢిల్లీ వెళ్లి వాణిని వినిపించారని ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలని సూచించారు.

తెలంగాణలో నాయకత్వం ఏమిటన్న దానిపై ఇప్పుడు పెద్దగా చర్చ అవసరం లేదని, టిడిపిని జాతీయ పార్టీగా చేసి రెండు ప్రాంతాల్లో పార్టీ బాగోగులు తాను చూసుకొంటానని, అందరికీ అవసరమైన సమయం కూడా ఇచ్చి బలోపేతం చేస్తానని బాబు తెలిపారు. సీమాంధ్ర ప్రజలకు మనో ధైర్యం ఇచ్చేందుకు చంద్రబాబు మాట్లాడుతుంటే తెలంగాణలోని కొన్ని పార్టీలు ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నాయని, ఎంత ఒత్తిడిని ఎదుర్కొన్నా తాను ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోలేదని టిటిడిపి నేతలు చెబుతున్నారు.
రాబోయే ఎన్నికల్లో పొత్తులపై చర్చ వచ్చినప్పుడు దాట వేశారు. బిజెపి సరిగ్గా వ్యవహరించలేకపోయిందన్న అభిప్రాయం సీమాంధ్రలో నెలకొందని, తెలంగాణలో పార్టీకి ఉన్న క్యాడర్ ఏ పార్టీకి లేదని, పదేళ్ల కాంగ్రెస్ పాలన ఆ పార్టీపై ప్రజలకు మొహం మొత్తేలా చేసిందని, దానిని సంపూర్ణంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఎన్నికలు వాయిదా పడే అవకాశం లేదని, వాటికి సన్నద్ధం కావాలని సూచించారు.
తెరాస విలీనమైనా, పొత్తులు పెట్టుకున్నా, ఒంటరిగా పోటీ చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ నెల 22న పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత నేతలతో బాబు మరోసారి భేటీ కానున్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచేది తామేనని టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు.












Click it and Unblock the Notifications