రాష్ట్రపతితో జగన్ భేటీపై ధ్వజమెత్తిన టిడిపి నేతలు

మిగతా నేరస్థులకు కూడా రాష్ట్రపతి ఇలాగే అపాయింట్‌మెంట్ ఇస్తారా అని ఆయన అడిగారు. ఉద్దేశ్యపూర్వకంగానే జగన్ కుప్పం పర్యటన పెట్టుకున్నారని, తమ పార్టీని బద్నాం చేయాలని చూస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ఎదుర్కోనేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరి చెప్పారు.
పది చార్జిషీట్లలో మొదటి ముద్దాయిగా ఉన్న జగన్‌కు రాష్ట్రపతి రెండు సార్లు ఎలా అపాయింట్‌మెంట్ ఇస్తారని తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రపతి ఇలా వ్యవహరించడం వల్ల సాక్షులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
జగన్ ఎక్కడికి వెళ్లేందుకు అనుమతి కోరినా సిబిఐ రెడ్ కార్పెట్ పరుస్తూ అంగీకరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా వ్యవహరించినప్పుడు ఇక సిబిఐ ఎందుకని, దాన్ని మూసేస్తే సరిపోతుందని ఆయన అన్నారు. జగన్ కేసు విషయంలో సిబిఐ యూటర్న్ తీసుకుంటే సిబిఐపై పెట్టిన ధనం వృధా అవుతుందని, దీనికన్నా ఆ సంస్థను రద్దు చేయడం మంచిదని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన నిర్ణయం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తొత్తులకు తప్ప మరెవరికీ ఆమోదయోగ్యం కాదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సమన్యాయం చేయకుండా రాష్ట్రాన్ని విభిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఆయన హెచ్చరించారు. రాయల తెలంగాణకు కొంత మంది రాయలసీమ కాంగ్రెసు నాయకులు మద్దతు తెలపడం విచారకరమని ఆయన అన్నారు.
అసెంబ్లీ సమావేశాలు ముగిసి ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ప్రోరోగ్ చేయకుండా సభాపతి నాదెండ్ల మనోహర్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఆనాడు నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్‌ను మోసం చేస్తే ఈనాడు ఆయన రాష్ట్ర ప్రజలకే ద్రోహం చేసేలా వ్యవహరిస్తున్నారని చంద్రమోహన్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications