వైసీపీలోకి చంద్రబాబు సన్నిహిత నేత - కీలక హామీ..!?
ఏపీలో ఎన్నికల రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. మూడు పార్టీల కూటమిలో జనసేన, బీజేపీ పార్టీలు తమ అభ్యర్దులను ప్రకటించాల్సి ఉంది. ఇదే సమయంలో వైసీపీ తమ అభ్యర్దులను ప్రకటించింది. ఇక, పొత్తులో భాగంగా సీట్లు రాని కొందరు టీడీపీ సీనియర్లు వైసీపీతో టచ్ లోకి వచ్చారు. అందులో భాగంగా మాజీ మంత్రి..చంద్రబాబు సన్నిహిత నేత వైసీపీతో టచ్ లోకి వచ్చారు.
వైసీపీలోకి బండారు
విశాఖ జిల్లాలో జనసేనతో పొత్తు కారణంగా పలువురు సీనియర్లకు సీటు దక్కలేదు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేసారు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ లాంటి నేతలు సీటు కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో బండారు సత్యనారాయణ నియోజకవర్గం పెందుర్తి స్థానం ఇప్పుడు పొత్తులో జనసేనకు వెళ్లింది.

అక్కడ సీటు ఆశించి భంగపడిన బండారుతో వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లారు. తమ పార్టీలోకి రావాలని ఆఫర్ ఇచ్చారు. పెందుర్తి అసెంబ్లీ స్థానం ఇప్పటికే అదీప్ రాజ్ కు వైసీపీ కేటాయించింది. అయితే, బండారుకు అనకాపల్లి ఎంపీ సీటు ఇస్తామని వైసీపీ నుంచి హామీ దక్కినట్లు సమాచారం.
ఎంపీ సీటు ఆఫర్
వైసీపీ నుంచి వచ్చిన ఆఫర్ పైన తన మద్దతు దారులతో బండారు చర్చలు చేస్తున్నారు. జనసేనకు సీట్లు కేటాయించిన ఎలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి, విశాఖ సౌత్‌లోని టీడీపీ అసంతృప్తులను ఆయన చేరదీస్తున్నారని సమాచారం. వారందరితో కలిసి వైసీపీలో చేరే అవకాశం ఉంది. ఎంపీగా పోటీ చేయటానికి బండారు సిద్దంగా ఉన్నట్లు సమాచారం.
దీని పైన బండారు స్పందించారు. తాను తన మద్దతు దారులతో చర్చలు చేస్తున్నట్లు వెల్లడించారు. రెండు రోజుల్లోనే తన నిర్ణయం అధికారికంగా ప్రకటిస్తానని చెప్పారు. పొత్తులో భాగంగా ఎలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి, విశాఖ సౌత్ అసెంబ్లీ స్థానాలు జనసేనకు కేటాయించారు. బండారుకు చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

వైసీపీలోకి విశాఖ నేతలు
బండారు సత్యనారాయణ కు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అల్లుడు అవుతారు. టీడీపీలో సుదీర్ఘ కాలం మంత్రిగానూ పని చేసారు. విశాఖ జిల్లాలో పార్టీ ముఖ్యుల్లో ఒకరిగా ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో వైసీపీ నుంచి అదీప్ రాజు, జనసేన నుంచి పంచకర్ల రమేష బాబు పోటీ చేయనున్నారు. తాజాగా వైసీపీ విడుదల చేసిన ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో అనకాపల్లి ఎంపీ స్థానం మాత్రమే పెండింగ్ లో ఉంది.
ఇప్పుడు బండారు అధికారికంగా వైసీపీలో చేరిన తరువాత ఈ స్థానం కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో, బండారుతో పాటుగా మరి కొందరు విశాఖ నేతలు వైసీపీలో చేరుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీంతో, బండారు పార్టీ మార్పు నిర్ణయం పైన ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications