ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం-విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ..!
ఏపీ రాజకీయాల్లో ఉప్పూ, నిప్పుగా ఉన్న రెండు కుటుంబాల ప్రతినిధులు ఇవాళ అనూహ్యంగా కలుసుకున్నారు. ఇందులో ఒకరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ కాగా.. మరొకరు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చిన సందర్భంగా వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. దాదాపు ఆరగంటసేపు భేటీ అయ్యాక ఇద్దరూ తిరిగి వెళ్లిపోయారు.

గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. వైసీపీ విపక్షంలో ఉండగా జగన్ ను పదే పదే టార్గెట్ చేసేవారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని జగన్ సర్కార్ పూర్తిగా టార్గెట్ చేసింది. రవాణా వాహనాల స్కాంలో పెద్ద ఎత్తున కేసులు కూడా నమోదు చేసింది. అప్పట్లో ఎమ్మెల్యేగా పోటీ చేయని జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. అయినా వైసీపీ వేధింపులు మాత్రం ఆగలేదు. తాజాగా కూటమి సర్కార్ లో ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ఇవాళ జగన్ తల్లి విజయమ్మను జేసీ ప్రభాకర్ రెడ్డి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే అసలు విషయాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ తర్వాత ట్వీట్ చేసారు. ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిన సందర్భంగా అక్కడ విజయమ్మ వెయిటర్స్ లాంజ్ లో కనిపించారని, దీంతో ఆమెను పలకరించినట్లు తెలిపారు. అంతే తప్ప తామిద్దరి భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని తేల్చిచెప్పేసారు.












Click it and Unblock the Notifications