కొత్త పార్లమెంట్ ఓపెనింగ్ కు హాజరుపై టీడీపీ కీలక నిర్ణయం- ప్రధాని మోడీకి చంద్రబాబు ట్వీట్..
ఈ నెల 28న ఢిల్లీలో జరిగే కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లాలా వద్దా అనే డైలమాకు టీడీపీ ఎట్టకేలకు తెరదించింది. పార్టీ నేతలతో ఇవాళ ఈ అంశంపై చర్చించిన అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అధికార వైసీపీ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని నిర్ణయించిన నేపథ్యంలో చంద్రబాబు నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీకి ఓ ట్వీట్ కూడా చేశారు.

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి తమ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ను పంపాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. లోక్ సభలో ముగ్గురు ఎంపీలు ఉన్నప్పటికీ చంద్రబాబు కనకమేడలను ఇందుకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో నేతలతో చర్చించిన తర్వాత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అనంతరం చంద్రబాబు దీనిపై ఓ ట్వీట్ కూడా చేశారు.

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానికి శుభాకాంక్షలు తెలిపే వారిలో భాగస్వామిని అవుతున్నందుకు సంతోషంగా ఉందని చంద్రబాబు ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఇలాంటి చారిత్రక కట్టడాన్ని నిర్మించినందుకు కేంద్రానికి కూడా అభినందలు తెలిపారు. భవిష్యత్తులో కాలనుగుణంగా వచ్చే మార్పులకు, కీలక నిర్ణయాలకు ఈ కొత్త భవనం వేదిక కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. 2047లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి దేశంలో పేదలు, ధనికుల మధ్య తారతమ్యం తగ్గించేందుకు ఇదో వారధిలా పనిచేయాలన్నారు.

పార్లమెంట్ భవనం ప్రారంభానికి ఇప్పటికే బీజేపీ, వైసీపీ, టీడీపీ పార్టీలు హాజరవుతున్నాయి. జనసేనకు ఎంపీలు లేనందున హాజరయ్యే అవకాశం లేదు. కమ్యూనిస్టులకు ఎంపీలున్నా వారు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించారు. దీంతో ఏపీలో మరోసారి బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలు మాత్రమే కేంద్రం ఆహ్వానాన్ని మన్నించినట్లయింది.












Click it and Unblock the Notifications