రేపు టీడీపీ రెండో జాబితా- చంద్రబాబు వెల్లడి- బీజేపీతో పొత్తుపై కీలక వ్యాఖ్యలు..!
ఏపీలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ-జనసేన అభ్యర్ధుల ఉమ్మడి తొలి జాబితాను పవన్ కళ్యాణ్ తో కలిసి విడుదల చేసిన చంద్రబాబు ఈసారి రెండో జాబితా మాత్రం విడిగానే చేయబోతున్నారు. రేపు సాయంత్రం టీడీపీ రెండో జాబితా విడుదల చేస్తామని చంద్రబాబు ఇవాళ ప్రకటించారు. జనసేన, బీజేపీ జాబితాలను విడివిడిగానే ప్రకటిస్తారని కూడా తెలిపారు. అలాగే బీజేపీతో పొత్తు, ఎన్టీయేలో తిరిగి చేరికపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మరో 50 అసెంబ్లీ సీట్లకు అభ్యర్ధుల్ని ప్రకటించాల్సి ఉండగా.. ఇందులో 25-30 సీట్లను, ఎంపీ సీట్లనూ రేపు ప్రకటించనున్నారు.
30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకారం ఎంతో అవసరమని చంద్రబాబు తెలిపారు. బీజేపీకి దక్షిణాదిలో సీట్లు తగ్గినా ఉత్తరాదిలో మాత్రం పరిస్దితి పూర్తిగా అనుకూలంగా ఉందని చెప్తున్నారన్నారు. ఏపీలో తాను గెలిచినా కేంద్రం సహకారం లేకుంటే అభివృద్ధి కష్టమన్నారు. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. బీజేపీ, జనసేనతో టీడీపీ సీట్ల సర్దుబాటుపై వైసీపీ నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఓట్లు చీలకూడదన్నదే పవన్ నిర్ణయం అని, వైసీపీని గద్దెదించడమే పవన్ లక్ష్యమని చంద్రబాబు తెలిపారు.

తాను కూడా గర్వానికి పోకుండా సర్దుకున్నానని సీట్ల సర్దుబాట్లపై చంద్రబాబు తెలిపారు. ప్రజల కోసం,భావి తరాల కోసం అందరం రాజీ పడ్డామన్నారు. రాష్ట్ర ప్రయోజనం కోసం తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకోలేదన్నారు. ఇప్పుడు అధికారం మారకపోతే చాలామంది హైదరాబాద్ వెళ్ళిపోతాం అని చెబుతున్నారన్నారు. హైదరాబాద్ లో ఎకరా అమ్మితే ఏపీ లో 100 ఎకరాలు కొనే పరిస్థితి ఇప్పుడు వచ్చిందన్నారు. సీట్ల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లినట్లు చంద్రబాబు తెలిపారు. ఒకరు ఎక్కువ...ఒకరు తక్కువ అని ఎవరూ భావించలేదన్నారు.
టిక్కెట్ రాని వారికి కొంతమందికి బాధ ఉంటుందని చంద్రబాబు తెలిపారు. అధికారంలోకి రాగానే వివిధ పదవులు ఇచ్చి ఆదుకుంటామన్నారు. ఎన్డీయేతో తమ పొత్తు ఇదే తొలిసారి కాదన్నారు. వాజ్ పేయ్ హయాంలోనే ఎలాంటి షరతులు పెట్టకుండా తాము మద్దతిచ్చామన్నారు. రాష్ట్రానికి మంచి చేయాలని అప్పుడు సహకరించానన్నారు. 2014 లో మోడీతో పొత్తుతో రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్నారు. కేంద్ర పథకాలను ఈ ప్రభుత్వం ఉపయోగించుకోలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం తప్ప, తనకూ బీజేపీకి ఎక్కడా విభేదాలు లేవన్నారు. బీజేపీ కూడా అమరావతి రాజధాని అని చెబుతుందన్నారు.
పోలవరం కట్టొద్దని కేంద్రానికి తాను చెప్పలేదని చంద్రబాబు గుర్తుచేశారు. ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా స్టీల్ ప్లాంట్ పై ఎందుకు ఒప్పించలేదని జగన్ ను ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ కు ఉన్న ప్రత్యామ్నాయాల పై ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్నారు. రైల్వే జోన్ కు స్ధలం కూడా ఇవ్వలేదన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాలూ నలిగిపోయారన్నారు. హైదరాబాద్ లో తాను చేసిన అభివృద్ధిని రాజశేఖర్ రెడ్డి కొనసాగించారని గుర్తుచేసుకున్నారు.












Click it and Unblock the Notifications