Waqf Amendment Bill:వక్ఫ్ సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు,మరిన్ని మార్పులు కోరే అవకాశం..!!
Waqf Amendment Bill:ఎన్డీయే కూటమిలో ముఖ్యమైన భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ వక్ఫ్ (సవరణ) బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, ఈ బిల్లుకు నాలుగో సవరణను కూడా ప్రతిపాదించే అవకాశం ఉందని తెలుస్తోంది. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం, తుది బిల్లు ముసాయిదాలో వారు సూచించిన మూడు సవరణలు ఇప్పటికే చేర్చబడ్డాయి, దీని కారణంగా మద్దతు ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం.
టీడీపీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, టీడీపీ వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు తెలపాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు వెల్లడించారు. కానీ, చర్చల సమయంలో, టీడీపీ ఎంపీలు ఒక ప్రధాన మార్పు కోసం పట్టుబడతారని చెప్పిన ఆయన... వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరుల ప్రాతినిధ్యం విషయంలో నిర్ణయం తీసుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలివేయాలని, ఈ మేరకు బిల్లులో సవరణ చేయాలని వారు కోరుతారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే భాగస్వాములైన టీడీపీ, జనసేన పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుని, బుధవారం లోక్‌సభ సమావేశాలకు హాజరు కావాలని తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. లోక్‌సభలో టీడీపీకు 16 మంది, జనసేనకు ఇద్దరు సభ్యులు ఉన్నారు.టీడీపీలోని ఒక ఉన్నత స్థాయి వర్గం తెలిపిన ప్రకారం,జేపిసిలో టీడీపీప్రతిపాదించిన మూడు సవరణలు తుది ముసాయిదా బిల్లులో చేర్చబడ్డాయి. కాబట్టి బిల్లుకు మద్దతు ఇవ్వడంలో ఎలాంటి సమస్య ఉండకపోవచ్చని చెప్పారు.
మరోవైపు, ముస్లిం వర్గాల నుండి కొందరు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వవద్దని టీడీపీ, జనసేనలపై ఒత్తిడి తెచ్చారు. టీడీపీనేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులను బహిష్కరించాలని కొన్ని ముస్లిం సంఘాలు పిలుపునిచ్చాయి.ఇంతకుముందు మార్చి 29న, వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లిం సంస్థలు విజయవాడలో నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహించాయి.జేపిసి సభ్యుడు కూడా అయిన టీడీపీపార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణ దేవరాయలు, గతంలోనే ఈ బిల్లుకు మూడు సవరణలను ప్రతిపాదించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications