ఏపీలో ఫలితాల వేళ వైసీపీ ఎమ్మెల్సీపై వేటు !
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి వేళ సంచలన పరిణామం చోటు చేసుకుంది. అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్సీపై అనర్హత వేటు పడింది. సొంత పార్టీ నుంచి అందిన ఫిర్యాదుపై విచారణ జరిపిన మండలి ఛైర్మన్ కొయ్య మోషేన్ రాజు.. ఆయనపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎన్నికల ఫలితాల వేళ మండలి ఛైర్మన్ నిర్ణయం చర్చనీయాంశమవుతోంది.

విజయనగరం జిల్లాకు చెందిన ఇందుకూరి రఘురాజు.. 2021లో జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా గెలిచారు. అప్పటి నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్న రఘురాజు.. తాజాగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి ఫిరాయించారు. ఎన్నికల్లోనూ రఘురాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా టీడీపీకి మద్తతుగా ప్రచారం చేశారు.
దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ మండలి ఛైర్మన్ కొయ్య మోషేన్ రాజుకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన అనర్హత వేటు ఫిర్యాదుపై విచారణ కోసం రావాలని రఘురాజుకు నోటీసులు పంపారు.
అయితే రఘురాజు ఆరోగ్య కారణాలను చూపుతూ తాజాగా విచారణకు గైర్హాజరయ్యారు. అంతకు ముందు కూడా విచారణకు నోటీసిచ్చినా రాలేదు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడే లోపు రఘురాజుపై అనర్హత వేటు వేయాలని మండలి ఛైర్మన్ భావించినట్లు తెలుస్తోంది. అందుకే ఇవాళ రఘురాజుపై పార్టీ ఫిరాయింపుల కారణంతో అనర్హత వేటు వేసినట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఇబ్బందుల్లేకుండా రఘురాజుపై ఇంత హడావిడిగా వేటు వేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications