పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక వేళ మారుతున్న లెక్కలు - గెలుపెవరిది..!!
పులివెందులలో ఏం జరుగుతోంది. జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఇక్కడ గెలుపు టీడీపీ - వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. వైఎస్ కుటుంబానికి అడ్డాగా.. జగన్ నియోజకవర్గం కావటంతో ఇక్కడ గెలుపును ఈ సారి టీడీపీ సీరియస్ గా తీసుకుంది. తమ పట్టు నిరూపించుకోవటానికి జగన్ టీం ప్రయత్నిస్తోంది. తాజాగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే, ఇక్కడ ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.
హోరా హోరీ
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 12న ఎన్నిక జరగనుంది. ఈ సారి ఉప ఎన్నిక హైప్ క్రియేట్ చేస్తోంది. టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నువ్వా, నేనా అంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. రెండు పార్టీలకు చెందిన ముఖ్యనేతలంతా ఇక్కడే తిష్ఠ వేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఊహించని విధంగా జిల్లాలో దెబ్బ తింది. షర్మిల అంశం కూడా ప్రభావం చూపింది. కాగా, ఇప్పుడు జెడ్పీటీసీ బై పోల్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం కావటంతో గెలుపే లక్ష్యంగా టీడీపీ నేతలు వ్యూహాలను అమలు చేస్తున్నారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి, వైసీపీ నుంచి హేమంత్‌రెడ్డి బరిలో ఉన్నారు.

మారుతున్న లెక్కలు
ఈ బైపోల్ లో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పులివెందుల జడ్పీటీసీకి ఆరు గ్రామ పంచాయతీల పరిధిలో 10,400 ఓట్లు ఉన్నాయి. వైసీపీ నుంచి పలువురు టీడీపీలో చేరారు.గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 2,166 ఓట్లు పోలయ్యాయి. వైసీపీకి 5,955 ఓట్లు వచ్చాయి. వైసీపీ నుంచి ఎంపీ అవినాశ్‌రెడ్డి వైసీపీ గెలుపు బాధ్యతలను భుజస్కంధాలపై వేసుకున్నారు. అదే సమయంలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఇతర టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ఇక్కడ గెలుపు కోసం రెండు పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. గెలుపు మాత్రం ఏకపక్షం గా లేదనేది స్పష్టం అవుతోంది.
గెలుపెవరిది
పులివెందులతో పాటుగా ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అంటూ ముందుకు పోతున్నాయి. టీడీపీ నుంచి అద్దలూరు ముద్దుక్రిష్ణారెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ తమ అభ్యర్థిని ముందుగానే ఖరారు చేసింది. దీంతో కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు ఒక విడత ఇంటింటి ప్రచారాన్ని పూర్తిచేశారు. ఇక్కడ మొత్తం 24,606 ఓట్లు ఉన్నాయి. 13 గ్రామ పంచాయతీలున్నాయి. బీసీ ఓటర్లు అధికంగా ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ప్రచార బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో ఇప్పటికీ గెలుపు ఎవరనేది ఇప్పటికీ అంతు చిక్కటం లేదు. దీంతో.. చివరి నిమిషం వరకు రెండు పార్టీలు శక్తి మేర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫలితం ఎవరికి అనుకూలంగా ఉంటుందనే ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications