మోడీపై కేసీఆర్ సాఫ్ట్: తెరాస అడుగులపై కన్నేసిన పార్టీలు
హైదరాబాద్: నరేంద్ర మోడీ కేబినెట్లో చేరే విషయమై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాట్లాడిన తీరు పైన రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మోడీ ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదు, అలాగని అనుకూలం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
మోడీ ప్రభుత్వంలో చేరే విషయమై కేసీఆర్ ఆచితూచి స్పందిస్తున్నారని అంటున్నారు. మోడీ ప్రభుత్వంలో చేరే విషయాన్ని పూర్తిగా కొట్టి పారేయకుండా... ఇప్పటికి అలాంటి చర్చలు జరగలేదని అభిప్రాయపడ్డారని గుర్తు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలలోనే పరమార్థం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వంలో చేరే విషయమై తాను ఇప్పటి వరకు ఏ విధమైన సంప్రదింపులు జరపలేదని చెప్పారు. తాము ప్రధాని ప్రభుత్వానికి అనుకూలం లేదా వ్యతిరేకం కాదని చెప్పారు. ఆ చర్చ వచ్చినప్పుడు చూద్దామని వ్యాఖ్యానించారు.

అలా అనడం వెనుక గూడార్థం ఉండి ఉంటుందని విపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం, మజ్లిస్ పార్టీలో తెరాస తీరు పైన దృష్టి సారించిందంటున్నారు. తెలంగాణలో తెరాసకు అనుకూలంగా మజ్లిస్ ఉంది. అలాగే బీజేపీ మిత్రపక్షంగా టీడీపీ ఉంది.
ఈ నేపథ్యంలో తెరాస నేతలు, సీఎం కేసీఆర్ వ్యాఖ్యల తీరును బట్టి ఆ పార్టీ వ్యూహాలు ఎలా ఉన్నాయనే విషయమై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కేసీఆర్ వ్యాఖ్యలను బట్టి మోడీ ప్రభుత్వం పట్ల సాఫ్టుగానే కనిపిస్తున్నారని, గ్రేటర్ ఎన్నికల తర్వాత చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల కోసం కేసీఆర్ వ్యూహాత్మకంగా వెళ్తుండవచ్చునని అంటున్నారు. హైదరాబాదులోని సీమాంధ్రులను మచ్చిక చేసుకోవడం కోసం వారికి భరోసా ఇచ్చే ప్రయత్నాలు కేసీఆర్ చేస్తున్నారని, అలాగే ఇప్పుడే ఎన్డీయేలో చేరుతామని తెలిస్తే ఓ వర్గం ఓట్లు పడవని భావించే తెరాస ప్రస్తుతానికి దాని పైన ఆచితూచి స్పందిస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications