కెసిఆర్ వ్యూహానికి టిడిపి చిత్తు: బిజెపి దెబ్బ కూడా, నోటాకు కృష్ణయ్య
హైదరాబాద్: ఎమ్మెల్యేల కోటా కింద తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యూహానికి తెలుగుదేశం పార్టీ చిత్తయినట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ రెంటికి చెడ్డ రేవడి అయింది. ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యుడు స్టీఫెన్ సన్‌కు లంచం ఇవ్వజూపుతూ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టు కావడం టిడిపిని నైతికంగా దెబ్బ తీయగా, పార్టీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. దీంతో తెలంగాణ శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కెసిఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు కనిపిస్తున్నారు. శాసనసభ్యులకు మోక్ పోలింగ్ నిర్వహించారు. రెండు రోజుల పాటు ఎలా ఓటేయాలి, ఎవరికి కేటాయించిన ఓటు వారికే ఎలా వేయాలి అనే విషయాలపై కెసిఆర్ తన పార్టీ శాసనసభ్యులకు పూసగుచ్చినట్లు చెప్పారు. అంతేకాకుండా, మంత్రి హరీష్ రావు ఈ విషయంలో బాధ్యత తీసుకుని ఎమ్మెల్యేలు సరిగా ఓట్లు వేసేలా చూశారు.
కాగా, బిజెపి ఐదు ఓట్లు చెల్లకపోవడం టిడిపిని తీవ్రంగా దెబ్బ తీసింది. బిజెపి సభ్యులు ఐదుగురు మొదటి ప్రాధాన్యతా ఓటు టిడిపి అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి వేసి, రెండో ప్రాధాన్యతా ఓటును నోటాకు వేశారు. దీంతో ఆ ఓట్లు చెల్లవని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. మరోవైపు, టిడిపి శాసనసభ్యుడు ఆర్. కృష్ణయ్య నోటాకు ఓటేశారు.

చాలా కాలంగా కృష్ణయ్య తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. టిడిపి ఎమ్మెల్యేలంతా కలిసి వచ్చి ఓటు చేయగా, కృష్ణయ్య ఒంటరిగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రేవంత్ రెడ్డి పట్టుబట్టి వేం నరేందర్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. ఆయన గెలిపించుకునే బాధ్యతను భుజాన వేసుకున్న ఆయన కటకటాల పాలయ్యారు. దీంతో టిడిపి నైతికంగా దెబ్బ తిన్నట్లు కనిపించింది.
రెండు విధాలుగా టిడిపిపై కెసిఆర్ విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీని నైతికంగా దెబ్బ తీయడంలోనూ ఎన్నికల్లో ఓడించడంలోనూ ఆయన పైచేయి సాధించారు. మొత్తం మీద, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తీవ్రమైన ఒత్తిడిని, గందరగోళాన్ని, అయోమయాన్ని ఎదుర్కుంటున్నట్లు కనిపిస్తోంది.
తెలంగాణ పార్టీలో రేవంత్ రెడ్డి ప్రాబల్యం పెరగడం కూడా టిడిపి తెలంగాణ నాయకులకు కొంత మందికి ఇష్టం లేదని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఈ విషయం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ మేరకు పనిచేసిందనేది ఇప్పుడే తేల్చడం కొంత కష్టమైన పనే. కానీ ఓట్లు చెల్లుబాటు కాకపోవడంలో ఇది కూడా పనిచేసిందా అనే సందేహం మాత్రం వ్యక్తమవుతోంది. దీంతో వేం నరేందర్ రెడ్డి విజయానికి పని చేయకుండా దూరంగా ఉండిపోయారని అంటున్నారు.
నిజానికి, రేవంత్ రెడ్డి అరెస్టు తర్వాత తమ పార్టీ అభ్యర్థి విజయంపై టిడిపి నాయకులు ఆశలు వదులుకున్నట్లు కనిపిస్తోంది. తమ పార్టీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి ఎలా ఓటు వేయాలనే విషయంపై టిడిపి ముందస్తు కసరత్తు కూడా జరగలేదు.
చెక్కు చెదరని కాంగ్రెసు ఓట్లు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెసు ఓట్లు చెక్కు చెదరలేదు. కాంగ్రెసుకు 18 మంది శాసనసభ్యులున్నారు. వారి ఓట్లన్నీ పార్టీ అభ్యర్థి ఆకుల లలితకే పడ్డాయి. కాంగ్రెసు, టిడిపిల్లో దేనికి టిఆర్ఎస్ అభ్యర్థి ఎసరు పెడతారనే సందేహం సోమవారంనాటి ఫలితాలతో వీడిపోయింది. తమ అభ్యర్థి విజయం సాధించడంతో కాంగ్రెసు పార్టీ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, గీతా రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు సంబరాల్లో పాల్గొన్నారు. శాసన మండలికి తొలి మహిళా సభ్యురాలిని అందించిన ఘనత కూడా కాంగ్రెసు పార్టీకి దక్కుతుంది.












Click it and Unblock the Notifications