ఆంధ్రాలో దొంగలపై తెలంగాణ పోలీసుల ఛేజింగ్, ఫైరింగ్..!
ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఇవాళ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పట్టణంలో పట్టపగలే జనం చూస్తుండగా బైక్ లపై వెళ్తున్న నలుగురు వ్యక్తుల్ని పోలీసులు వెంటపడి తరుముతున్నారు. ఇదే క్రమంలో వారు తప్పించుకునే ప్రయత్నం కూడా చేయడంతో పోలీసులు కాల్పులు చేశారు. గాల్లోకి పలు రౌండ్ల కాల్పులు జరిపారు. అయినా ఆ నలుగురిలో వారికి ఒకరు మాత్రమే చిక్కారు. మిగతా ముగ్గురూ పరారయ్యారు.
తెలంగాణకు చెందిన పోలీసులు ఇవాళ సత్యసాయి జిల్లా ధర్మవరం వచ్చారు. అక్కడ బైక్ లపై వెళ్తున్న నలుగురు దొంగల్ని వారు కారులో వెంబడించారు. పోలీసులు హెచ్చరికలు చేస్తున్నా వారు మాత్రం ఆగలేదు. దీంతో సినీ ఫక్కీలో పోలీసులు-దొంగలు కాసేపు దోబూచులాడుకున్నారు. చివరికి వారిని ఆపేందుకు తెలంగాణ పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా అందులో ఒకరు మాత్రమే దొరికి మిగతా వారు పరారవ్వడంతో పోలీసులు చేసేది లేక వెనుదిరిగారు.

దీనిపై ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు వివరాలు అందించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం తెలంగాణకు చెందిన పోలీసులు అక్కడ జరిగిన ఓ దొంగతనానికి సంబంధించి ఈ నలుగురిని వెతుక్కుంటూ వచ్చినట్లు తెలిపారు. అయితే వీరిని పట్టుకునేందుకు వారు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. అయినా ఒక్కరిని మాత్రమే పట్టుకుని తెలంగాణకు తిరిగి పయనం అయినట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications