29వ రాష్ట్రంగా టి: మిడ్‌నైట్ సంబరాలు, తెరాసకు డబుల్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో తెలంగాణలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. జూన్ 2న అపాయింటెడ్ తేదీ ఉంది. దీంతో ఆదివారం అర్ధరాత్రి సంబరాలు చేసుకునేందుకు తెలంగాణవాదులు, వివిధ సంఘాలు, పలు పార్టీలు సిద్ధమయ్యాయి. తెరాస, బిజెపి, కాంగ్రెస్, తెలంగాణ టిడిపి నేతలు తమ తమ పార్టీ కార్యాలయాల్లో వేడుకలను జరుపుకుంటున్నారు. వారు పార్టీ జెండాలతో పాటు జాతీయ జెండాను ఎగురవేస్తారు.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు తెలంగాణవ్యాప్తంగా పది జిల్లాలు సిద్ధమయ్యాయి. అరవయ్యేళ్ల తెలంగాణ కలను సాకారం చేసుకున్నందున.. తెల్లవారితే ఆవిర్భావ దినం కావడంతో తెలంగాణవాదులు ఆదివారం రాత్రంతా సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ ఘన చరిత్రను చెప్పనున్నారు. అమరవీరుల త్యాగాన్ని స్మరించుకోనున్నారు. అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి గంట సేపు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకొని వేడుకలు చేసుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అన్ని పార్టీలు ఉత్సాహంగా జరుపుకోనున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమించినందున, ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అవుతున్నందున రాష్ట్ర రాజధాని హైదరాబాదు పూర్తిగా గులాబీమయమైపోయింది. ఏ చౌరస్తాలో చూసినా గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. కెసిఆర్ కటౌట్లు, హోర్డింగులు దర్శనమిస్తున్నాయి. బెలూన్లు ఏర్పాటు చేశారు. తొలుత ఆవిర్భావ వేడుకలు తెరాసకు, తెలంగాణవాదులకే పరిమితమైనట్లుగా కనిపించాయి.
తాము తెలంగాణ ఆవిర్భావ సంబరాల్లో పాల్గొంటామని తెలంగాణ టిడిపి నాయకులు ప్రకటించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించాలని, పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని బిజెపి నిర్ణయించింది. తెలంగాణ ఇచ్చింది తామే అంటూ కాంగ్రెస్ సంబరాల్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సిపిఐ పాల్గొంటోంది. పీపుల్స్ ప్లాజా, గన్‌పార్క్, పరేడ్ గ్రౌండ్ తెలంగాణ సంబరాలకు వేదికలు కానున్నాయి.
నాలుగు దశాబ్దాలైనా ఆవిష్కరణకు నోచుకోని గన్‌పార్క్‌లోని అమర వీరుల స్థూపం ఇప్పుడు తెలంగాణకు పవిత్ర క్షేత్రం. ఎమ్మెల్యే, ధూం.. ధాం సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకుడు రసమయి బాలకిషన్ ఆదివారం రాత్రి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ధూం ధాం నిర్వహిస్తారు. హైదరాబాద్ నగరంలోని 120 ప్రాంతాల్లో గంట పాటు బాణాసంచను కాల్చనున్నారు. రాజ్‌భవన్‌కు ఎక్కువ మంది వచ్చే అవకాశం లేనందున పీపుల్స్ ప్లాజా వద్ద తెలగాణ సంబరాలు నిర్వహిస్తున్నారు.
నగరంలోని 25 సెంటర్లలో 60 అడుగుల ఎతైన కెసిఆర్ కౌటట్లు ఏర్పాటు చేశారు. వంద కేంద్రాల్లో స్టేజీలు ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జూన్ రెండున కెసిఆర్ ఉదయం 7.30కి తొలుత గన్‌పార్క్‌కు వెళ్లి తెలంగాణ అమర వీరులకు నివాళి అర్పించి అటు నుంచి రాజ్‌భవన్‌కు వెళతారు. 8.15కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అటు నుంచి తెలంగాణ భవన్‌కు వెళ్లి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు. ఉదయం 10.40కి పరేడ్ గ్రౌండ్‌లో జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటారు.
తెరాసకు డబుల్ కిక్
పదముడేళ్లుగా తెలంగాణ కోసం తెరాస తీవ్ర ఉద్యమం చేసింది. ఈ ఉద్యమంలో తమతో పాటు టిడిపి, కాంగ్రెసు, బిజెపి తదితర పార్టీలు కలిసి వచ్చేలా చేసింది. తెలంగాణ కోసం ఎందరు యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. తెరాస కృషి, అమరవీరుల బలిదానాల వల్లనే తెలంగాణ వచ్చిందని తెరాస చెబుతుంటుంది. తెరాసకు ఈ వేడుకలు డబుల్ కిక్ అని చెప్పవచ్చు. ఓ వైపు తెలంగాణ వచ్చిన సంబరాలు, మరోవైపు తమ ప్రభుత్వమే అధికారంలోకి రావడం ఆ పార్టీకి రెండింతల సంతోషాన్ని తీసుకు వచ్చింది.
ఎవరికి వారే..
తమ వల్లే తెలంగాణ వచ్చిందని ఏ పార్టీకి ఆ పార్టీలు చెప్పుకుంటాయి. పదమూడేళ్ల కెసిఆర్ పోరాటం వల్లే వచ్చిందని తెరాస అంటే.. నరేంద్ర మోడీ భయంతో ఇచ్చారని బిజెపి, చంద్రబాబు లేఖ ఇవ్వడం వల్లే ఇచ్చారని టిటిడిపి, తెలంగాణ ప్రజల ఆకాంక్ష గుర్తించి సోనియా ఇచ్చారని టి కాంగ్రెసు నేతలు చెబుతున్నారు.
తెలంగాణ, ఎపి సిఎస్‌లు, డిజిపిలు వీరే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీగా జేవీ రాముడు నియమితులయ్యారు. తెలంగాణ సిఎస్‌గా రాజీవ్ శర్మ నియమితులయ్యారు. తెలంగాణ డీజీపీగా అనురాగ్ శర్మ ఉంటారు.












Click it and Unblock the Notifications