నాపై నెపం నెట్టి లబ్ధి, భారం కావొద్దనే: కేసీఆర్‌పై బాబు
హైదరాబాద్: తనను, తెలుగుదేశం పార్టీని తిట్టి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజకీయంగా బతకాలనుకుంటున్నాడని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఏ సమస్య వచ్చినా దాన్ని వక్రీకరించి తన పైకి నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నాడని, వాస్తవాలను వక్రీకరించి ప్రజలను చీల్చడానికి చూస్తున్నాడని ఆయన విమర్శించారట.
బుధవారం రాత్రి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ప్లాంట్లను తాను పని గట్టుకుని ఆపుచేసి తెలంగాణలో విద్యుత్ కొరత సృష్టించానని కేసీఆర్ చేసిన ఆరోపణలను చంద్రబాబు ప్రస్తావించారు. ఏటా సాధారణంగా జరిగే మరమ్మతుల్లో భాగంగా వాటిని నిలుపుదల చేశారని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా అలాగే ఆపు చేసి మరమ్మతులు చేస్తారని ఆయన వివరించారు.

తాను ఏపీ సీఎంగా ఆ ప్రాంత అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూనే, టీడీపీ అధ్యక్షుడిగా ఇరు ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తానని అందరూ కలిసి ఉండాలని కోరుకుంటానని చెప్పారు. అన్ని ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, ప్రజలు ఎక్కడికైనా వెళ్లి చదువుకుని ఎక్కడో ఉద్యోగాలకు వెళుతుంటారని, కానీ ఎక్కడా ఆరవై ఏళ్ల క్రితం ఉన్న వారికే సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామనటం లేదని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వానికి భారం కాకూడదని మొత్తం ఫీజుల ఖర్చులో 58 శాతం భరిస్తానని తాను ముందుకు వచ్చానని, అయితే తెలంగాణ ప్రభుత్వం కావాలని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని, ప్రజలకు ఈ అన్ని అంశాల్లో వాస్తవాలను వివరించాలని అందుకు వెనకాడవద్దని తెలంగాణ ప్రాంత నేతలకు బాబు సూచించారు. తెలంగాణ ప్రాంతంలోని ఆంధ్రప్రాంత విద్యార్థుల ఫీజుల విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది.












Click it and Unblock the Notifications