బాబు దీక్ష వారికి ఆయుధమైందా?: టిటిడిపి ఆందోళన
హైదరాబాద్: విభజన తీరును నిరసిస్తూ ఇటీవల న్యూఢిల్లీలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దీక్ష చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ దీక్షపై సీమాంధ్ర నాయకుల్లో కొత్త ఉత్సాహం తీసుకు రాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతల్లో మాత్రం ఆందోళన కలిగిస్తోందంటున్నారు. సిడబ్ల్యూసి నిర్ణయం, కేబినెట్ నోట్ అనంతరం సీమాంధ్రలో ఒక్క వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే ప్రధాన పాత్ర పోషించింది.
అయితే చంద్రబాబు దీక్ష తర్వాత సీమాంధ్ర టిడిపిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఒకవిధంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష కంటే బాబు దీక్షనే హైలెట్ అయిందని భావిస్తున్నారు. సీమాంధ్ర ప్రజల్లోను తమ అధినేత దీక్ష ఓ ధీమాను కలిగించిందంటున్నారు. అదే సమయంలో టిటిడిపి నేతలు మాత్రం ఆందోళన చెందుతున్నారట. బాబు దీక్ష చేయకుండా మౌనంగా ఉంటే బాగుండేదని, బాబు దీక్ష చేయడం వల్ల తెలంగాణ ప్రజల్లోకి ప్రత్యర్థి పార్టీలు తప్పుడు సంకేతాలు తీసుకు వెళ్లే అవకాశాలున్నాయని ఆవేదన చెందుతున్నారట.

చంద్రబాబు ఇచ్చిన లేఖ వల్లనే కాంగ్రెసు విభజన పైన నిర్ణయం తీసుకుందని తాము తమ ప్రాంత ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్తున్న సమయంలో బాబు దీక్ష దానికి అడ్డు చెప్పినట్లుగా అయిందని మథనపడుతున్నారంటున్నారు. బాబు దీక్ష తెలంగాణ ప్రాంతంలోని తమ ప్రత్యర్థులకు ఆయుధంగా మారిందని టిటిడిపి నేతలు చర్చించుకుంటున్నారట.
ఇన్నాళ్లు తమ లేఖ ద్వారానే కేంద్రం నిర్ణయం తీసుకుందని చెబుతున్నామని, ఇప్పుడు బాబు దీక్షతో తాము సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఎన్నికలు ఎంతో దూరంలో లేనందున ప్రభావం పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారట.
అయితే బాబు దీక్ష తెలంగాణకు వ్యతిరేకంగానో, సమైక్యాంధ్ర కోసమో కాదని, సీమాంధ్ర భవిష్యత్తు కోసమేనని, అలాంటప్పుడు తెలంగాణలో తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని మరికొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. తమ పార్టీ లేఖ వల్లనే కాంగ్రెసు విభజన నిర్ణయం తీసుకుందని, దీనిని ప్రజల్లోకి తాము ఎన్నికల ముందు మరింత బలంగా తీసుకు వెళ్తామని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications