TDP ఏదైతే కోరుకుందో BRS అదే చేస్తోంది?
ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సభ విజయవంతమైంది. సభలో పాల్గొన్న చంద్రబాబు ఈరోజు తెలంగాణ ఇలా ఉండటానికి తాను చేసిన అభివృద్ధి పనులేనని గుర్తుచేశారు. టీడీపీని బలోపేతం చేసేందుకు పార్టీని వీడిన నేతలంతా తిరిగి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ చేపట్టిన భారీ కార్యక్రమం ఇది.

ఇతర జిల్లాల్లో కూడా భారీ బహిరంగసభలు
కాసాని జ్ఞానేశ్వర్ ను తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా నియమించిన తర్వాత టీడీపీని పరుగులు పెట్టించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మంలో బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించారు. త్వరలోనే వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కూడా బహిరంగసభలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. చంద్రబాబు ప్రసంగించిన తర్వాత ఆయన మాటలను భారత రాష్ట్ర సమితి నేతలు హరీష్ రావు, కవిత ఖండించారు. జిల్లాల స్థాయిలో బీఆర్ఎస్ నాయకులు కూడా టీడీపీపై ధ్వజమెత్తుతున్నారు.

ఓటుబ్యాంకు తగ్గితే భారీ నష్టం?
ఇప్పటివరకు ఆ పార్టీకి మద్దతు పలుకుతున్న సెటిలర్లతోపాటు నిజామాబాద్, వరంగల్ తదితర జిల్లాల్లో కూడా ఉన్న ఆంధ్రులు మళ్లీ ఆ పార్టీవైపు మళ్లుతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీతో రానున్న ఎన్నికల్లో హోరాహోరీగా తలపడాల్సి ఉండటంతో బీఆర్ఎస్ కు ఓటుబ్యాంకుగా ఉన్నవారంతా టీడీపీవైపు మళ్లితే తనకు నష్టమని ఆ పార్టీ అధిష్టానం అంచనా వేస్తోంది. అందుకే మొదట్లోనే ఆ పార్టీని నిరోధించాలనుకుంటోంది. వెంటనే ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగి విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ సభ వల్ల తెలుగుదేశం పార్టీ రెండు ప్రయోజనాలు ఆశించింది. మొదటి బీఆర్ఎస్ నుంచి విమర్శలు రావడం. అది కోరుకున్నట్లుగా నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనివల్ల ఇతర రాజకీయ పార్టీలన్నింటికన్నా ప్రజల్లో తెలుగుదేశం గురించే చర్చ జరిగి లాభం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. రెండో ప్రయోజనం ప్రజల్లో రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చ జరిగేలా చేయడం.

వ్యతిరేకతను టీడీపీవైపు మళ్లించాలని..
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందని అంచనా వేస్తోన్న చంద్రబాబు దాన్ని టీడీపీవైపు మళ్లించాలని ప్రణాళికలు రచించారు. సెటిలర్ల పార్టీ, ఆంధ్రుల పార్టీ అంటూ ప్రజల్లో సెంటిమెంట్ ను ఎగదోయడానికి భారత రాష్ట్ర సమితికి ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకంటే అది జాతీయస్థాయి పార్టీగా మారిపోయింది కాబట్టి. సభకు కొద్దిరోజుల ముందే చంద్రబాబును ఐఎస్ బీ ప్రతినిధులు కొనియాడారు. దీంతో ఐటీ, మొబైల్ రంగాలకు సంబంధించిన చర్చ జరిగితే తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని పార్టీ భావించిన సరిగ్గా వారు కోరుకున్నట్లుగానే జరగడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించి రానున్న ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.!!












Click it and Unblock the Notifications