పవన్ కళ్యాణ్‌తో వైరం: బాబు అప్రమత్తం, టిడిపి ప్యాచప్ కష్టాలు
హైదరాబాద్: జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ తన ప్రశ్నల వర్షాన్ని తమపైనే గురి పెట్టడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇతర పార్టీలను, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ప్రశ్నించి తమకు అండగా నిలబడతారని టిడిపి నాయకులు భావించి పప్పులో కాలేశారు. ఆయన ప్రశ్నల వర్షం తమపైనే కురుస్తుండడంతో చిక్కుల్లో పడ్డారు.
పవన్ కళ్యాణ్‌తో వైరం తీవ్ర పరిణామాలు దారి తీస్తుందనే ఆందోళనతో తెలుగుదేశం పార్టీ ప్యాచప్ ప్రయత్నాలను ప్రారంభించింది. పవన్ కళ్యాణ్‌తో వైరం వల్ల ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ సామాజిక వర్గం తమకు దూరమయ్యే ప్రమాదం ఉందని గుర్తించిన తెలుగుదేశం పార్టీ నష్టనివారణ చర్యలకు దిగింది. పవన్ కళ్యాణ్‌తో సయోధ్యకు ప్రయత్నాలు ప్రారంభించింది.

తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న ఓ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ వల్ల దగ్గరైంది. దానివల్లనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగలిగిందనే అంచనా ఉంది. పవన్ కళ్యాణ్‌పై టిడిపి పార్లమెంటు సభ్యులు విరుచుకుపడడంతో ఆయన అభిమానులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలకు దిగారు. ఎవరి వల్ల అధికారంలోకి వచ్చారో తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తు చేసుకోవాలని హెచ్చరించారు. పరిస్థితి తీవ్రతను గమనించిన టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు అప్రమత్తమై, తమ పార్టీ నాయకులను నిలువరించారు.
పవన్ కళ్యాణ్‌పై విమర్శల దాడిని ఆపేయడమే కాకుండా నష్టనివారణకు చర్యలను కూడా ప్రారంభించారు. తమ పార్టీ పార్లమెంటు సభ్యుల నోరు మూయించిన తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం ప్యాచప్ కోసం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గాలి ముద్దు కృష్ణమ నాయుడి వంటి నాయకులకు రంగంలోకి దింపినట్లు అర్తమవుతోంది.
పవన్ కళ్యాణ్ చాలా మంచివారని, అయితే ఆయనను ఎవరో రెచ్చగొడుతున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్ బిజెపి -టిడిపి కూటమి శ్రేయోభిలాషి అని గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్‌కు అనుకూలంగా పలు వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్‌తో ప్యాచప్ చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగానే కష్టం పడుతున్నట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications