తెలుగు సినిమా హీరోల్లో టీడీపీ వారెవరు? వైసీపీ వారెవరు? జనసేన ఎవరు?
ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఏదో ఒక పార్టీకి పరోక్షంగా మద్దతు తెలియజేస్తుంటుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంతవరకు, ఎన్నికలు జరిగే సమయంలో ప్రముఖ కథానాయకులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌తోపాటు దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వనీదత్, మురళీమోహన్, నారా రోహిత్ తదితరులు ప్రత్యక్షంగా మద్దతు పలికేవారు. మరికొందరు పరోక్షంగా మద్దతు తెలియజేశారు. 2009 ఎన్నికల తర్వాత నుంచి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరం జరిగారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెజారిటీ వర్గం తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికేదనే విషయం తెలిసిందే.

వైసీపీకి మద్దతుగా..
అయితే ఈసారి ఏపీలో అధికారం చేజిక్కించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టాలీవుడ్ నుంచి మద్దతు కోరుకుంటోంది. ముఖ్యమంత్రి జగన్‌ను చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, కొరటాల శివ, రాజమౌళి, దిల్ రాజు తదితరులు థియేటర్లలో టికెట్ల విషయమై పలుమార్లు ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. ఆయన కూడా సుముఖంగానే ఉండటంతో వారు టికెట్లు పెంచుకోగలిగారు. నాగార్జున కుటుంబం ప్రత్యక్షంగానే జగన్‌కు మద్దతునిస్తోందనే విషయం సుస్పష్టం. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున అలీ, పృథ్వీ, పోసాని కృష్ణమురళి, మోహన్‌బాబు లాంటివారు జగన్ కోసం ప్రచారం నిర్వహించారు.

అలీకి దక్కని రాజ్యసభ సభ్యత్వం
ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ సభ్యుల ఎంపిక కోసం ప్రతిసారీ అలీ పేరు వినిపించేది. కానీ ఆయనకు సభ్యత్వం మాత్రం దక్కలేదు. ఈసారి గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అడుగుతున్నారు. దీనిపై అధిష్టానం నుంచి ఇంకా హామీ లభించలేదని సమాచారం. పృథ్వీ తనకు అన్యాయం జరిగిందంటూ జనసేనలోకి వెళ్లిపోయారు. పోసాని సైలెంటయ్యారు. ఏమీ మాట్లాడటంలేదు. ఆయనకు సినిమాల్లో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. మోహన్‌బాబు ఇటీవలే చంద్రబాబును కలిశారు. ప్రధానమంత్రి మోడీ తమకు కుటుంబ మిత్రుడని ప్రకటించారు. దీంతో ఆయన వైసీపీ కాకుండా ఎటువైపేనా మొగ్గుచూపే అవకాశం కనిపిస్తోంది.

పవన్ కు అండగా రామ్ చరణ్
రామ్‌చరణ్ జనసేనకు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో ఆయన జనసేన తరఫున ప్రచారం నిర్వహించే అవకాశాలున్నాయి. చిరంజీవి విషయమే సందిగ్ధంలో ఉంది. ఒకవైపు మిత్రుడు జగన్, మరోవైపు తమ్ముడు పవన్‌కల్యాణ్. ప్రత్యక్షంగా జగన్‌కు మద్దతిచ్చినా పరోక్షంగా పవన్‌కు మద్దతు తెలిపే అవకాశం ఉందంటున్నారు. భారతీయ జనతాపార్టీ కూడా ఆహ్వానిస్తున్నప్పటికీ ఆయన సున్నితంగా తోసిపుచ్చుతున్నారు. ప్రస్తుతం సినిమాలపైనే దృష్టిపెట్టానని బీజేపీ పెద్దలకు తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రధానమైన నాలుగు కుటుంబాల్లో నందమూరి కుటుంబం, దగ్గుబాటి కుటుంబం, మెగా కుటుంబం, అక్కినేని కుటుంబాల్లో రెండు తెలుగుదేశం పార్టీకి, ఒకటి వైసీపీకి, ఒకటి జనసేనకు మద్దతు తెలియజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications