అసెంబ్లీలో ఇవే: టిడిపి సంబరాలు, నిరాశలో జగన్‌పార్టీ
హైదరాబాద్: మున్పిపల్ ఫలితాల పైన తెలుగుదేశం పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోమవారం మున్సిపల్ ఫలితాల పైన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రానున్న లోకసభ, అసెంబ్లీ ఎన్నికలలోను ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని యమనల అన్నారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో అసంతృప్తి కనిపిస్తోంది.
కాగా, సీమాంధ్రలో మున్సిపల్ ఫలితాలలో టిడిపి హవా కొనసాగుతోంది. అత్యధిక మున్సిపాలిటీలను టిడిపి గెలుచుకుంటోంది. కడప, నెల్లూరు కార్పోరేషన్‌లలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుచింది. రాజమండ్రి, చిత్తూరు, అనంతపురం, విజయవాడ, ఏలూరు కార్పోరేషన్లను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది.

సీమాంధ్రలో అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో పాటు తెలంగాణలోను టిడిపి పరువు నిలబెట్టుకుంది. తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీ జీరో అవుతుందని అందరూ భావించారు. కానీ నాలుగు మున్సిపాలిటీలను గెలుచుకుంది. మధ్యాహ్నం పదకొండున్నర గంటల వరకు తెలంగాణలో కాంగ్రెస్ 22, తెరాస 11, టిడిపి 4, బిజెపి 2, మజ్లిస్ 1 మున్సిపాలిటీలను గెలుచుకుంది.
కరీంనగర్ కార్పోరేషన్‌ను తెరాస, నిజామాబాద్, రామగుండం కార్పోరేషన్లను కాంగ్రెసు గెలుచుకుంది. మధ్యాహ్నం పదకొండున్నర గంటల వరకు సీమాంధ్రలో టిడిపి 58, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 17 మున్సిపాలిటీల్లో విజయకేతనం ఎగురవేశాయి. కాంగ్రెసు పార్టీ ఇప్పటి వరకు సీమాంధ్రలో ఖాతా తెరవలేదు.












Click it and Unblock the Notifications