చంద్రగిరిలో ఉద్రిక్తత: టీడీపీ కీలకనేత ఆత్మహత్యాయత్నం!!
ఏపీలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. ఏపీ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తూ ఎన్నికల హడావిడిలో ముందు వరుసలో ఉంటే, టీడీపీ జనసేన పొత్తులలో భాగంగా సీట్ల సర్దుబాటు జరుగుతుంది.ఈసారి ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. అయితే ఏపీలో ఎన్నికల సమయంలో దొంగ ఓట్లపై ప్రధానంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రచ్చన్న సమరం జరుగుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ దొంగ ఓట్లను నమోదు చేసిందని టీడీపీ ఆరోపణలు గుప్పిస్తుంది. ఏపీలో ఓటరు జాబితాలో అవకతవకలపై పంచాయితీ ఢిల్లీకి చేరింది. నేడు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో దొంగ ఓట్లు, ఓటరు జాబితాలో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు.

ఇక ఇదే సమయంలో చిత్తూరు జిల్లా చంద్రగిరిలో నమోదైన దొంగ ఓట్లను తొలగించాలని టీడీపీ నేతలు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తంగా మారింది. తిరుపతి గ్రామీణం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేసిన టీడీపీ నాయకులు దొంగ ఓట్లపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
అదే సమయంలో టీడీపీ నేతలకు పోటీగా వైసీపీ నేతలు దళితులతో కలిసి నిరసనకు దిగారు. రెండువర్గాలు నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా ఇదే సమయంలో టీడీపీ చంద్రగిరి ఇంచార్జి పులివర్తి నాని ఆత్మహత్యాయత్నం చేశారు. దొంగ ఓట్లను తొలగించాలంటూ ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.
టీడీపీ నేత పులివర్తి నాని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు ఆయన్ను అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఆ సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను తిరుపతి స్విమ్స్‌లో చికిత్స కోసం తరలించారు. మొత్తంగా నేడు దొంగ ఓట్ల విషయంలో అధికార వైసీపీకి, ప్రతిపక్ష టీడీపీ నేతలకు మధ్య చిత్తూరు జిల్లాలో రణరంగం జరిగింది.












Click it and Unblock the Notifications