టీలో జీరో, విభజనపై జగన్ పార్టీ ఆశ: టిజి వెంకటేష్
హైదరాబాద్: తెలంగాణలో జీరో స్థాయిలో ఉన్న వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణలో జీరో స్థాయిలో ఉందని, అందుకే విభజన జరిగితే లాభం ఉంటుందని ఆశపడుతోందని రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో సోమవారం సాయంత్రం సీమాంధ్ర మంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు శైలజానాథ్, కొండ్రు మురళి, అహ్మదుల్లా, కాసు వెంకటకృష్ణారెడ్డి, టిజి వెంకటేష్ పాల్గొన్నారు.
తెలంగాణ అంశాన్ని తెర మీదికి తెచ్చిందే వైయస్ రాజశేఖర రెడ్డి అని ఆయన విమర్శించారు. రౌడీ మూకలు సమైక్యవాద ఉద్యమంలో చేరి డ్రామాలు ఆడుతున్నాయని సమావేశానంతరం టిజి వెంకటేష్ అన్నారు. మూడు నెలల కోసం మంత్రిపదవుల కోసం ఆరాటపడేవాళ్లు ఎవరూ లేరని ఆయన అన్నారు. కుర్చీకి తాము అంటిపెట్టుకుని ఉన్నామనే విమర్శలు సరి కాదని ఆయన అన్నారు. విభజనకు లేఖ ఇచ్చి యూటర్న్ తీసుకున్నవాళ్లు తమను విమర్శిస్తున్నారని ఆయన అన్నారు.

2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణకు అనుకూలంగా కేంద్రం చేసిన ప్రకటనను చర్చల స్థాయికి మార్చామని, అది తమ సత్తా అని, తమ సత్తా ఏమిటో మరిచిపోతున్నారని ఆయన అన్నారు. తాము ఏం చేస్తున్నామనే విషయం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తెలుసునని ఆయన అన్నారు. విభజన జరిగితే తెలంగాణ బాధపోతుందని వైయస్సార్ కాంగ్రెసు అనుకుంటోందని, పైగా తమ మీద పడుతోందని అన్నారు. సమైక్యవాదం ముసుగులో దాడులు చేస్తే సహించబోమని, దీనికి సమైక్య జెఎసిలు సమాధానం చెప్పాలని ఆయన అన్నారు.
తాము హైదరాబాదులో ఖాళీగా కూర్చోలేదని మరో మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించాల్సిన అవసరం ఉందని, అందుకే రాజీనామాలు చేయడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. కొంత మంది ఓట్ల కోసం సమైక్య ఉద్యమాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కొందరు పనికట్టుకుని తమపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.
సమైక్యవాదులు కొంత మంది భిన్నవాదనలు చేస్తున్నారని, రాజీనామాలు చేయాలని కొందరూ వద్దని కొందరూ ఒత్తిడి తెస్తున్నారని గంటా శ్రీనివాస రావు అన్నారు. రెండు మూడు రోజుల్లో మరోసారి సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు సమైక్యవాదంలో చిత్తశుద్ధి లేదని మరో మంత్రి శైలజానాథ్ విమర్శించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మొదటి నుంచీ కాంగ్రెసు మాత్రమే పనిచేస్తోందని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు ఉద్యమంలో పదాల మాయాజాలం తప్ప చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications