జగన్ వేసిన ఓ తప్పటడుగు: రాష్ట్ర విభజన, సీఎం పదవి సాకారం కాలేదు?
అమరావతి: టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మంగళవారం వైయస్ జగన్ ఉద్దేశించి ఆసక్తకర వ్యాఖ్య చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత వైయస్ జగన్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని ఆయన అన్నారు.
జగన్ ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించి తీరా అది దక్కకపోవడంతో కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిపోవడం చేతనే కాంగ్రెస్ హైకమాండ్ విధిలేని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ జగన్ సీఎం పదవి కోసం పట్టుబట్టకుండా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పట్ల విధేయతగా ఉంటే ఆమె రాష్ట్ర విభజనకు అంగీకరించేవారు కాదని ఆయన స్పష్టం చేశారు.
టీజీ వ్యాఖ్యలు ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అంతేకాదు ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న టీజీ వెంకటేశ్ మాటల్లో ఎంతో కొంత వాస్తవం ఉందని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం గతంలో పలుమార్లు ఉద్యమాలు జరిగినా, రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు వాటి ప్రభావం కనిపించకుండా ఆయన జాగ్రత్తపడ్డారు.
వైయస్ మరణించడం, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా రోశయ్యను కాంగ్రెస్ హైకమాండ్ నియమించిన తర్వాతే తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ఊపందుకుంది. వైయస్ వారసుడిగా జగన్‌కు అటు ఆంధ్ర ప్రాంతంలోనూ, ఇటూ తెలంగాణ ప్రాంతంలోనూ మంచి గుర్తింపుతో పాటు సానుభూతి కూడ ఉంది.
ఈ క్రమంలో జగన్ సీఎం పదవి కోసం పట్టుబట్టకుండా కాంగ్రెస్ లోనే ఉండి ఉంటే, సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించే వారు కాదనే చెప్పాలి. నిజానికి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేసినప్పటికీ, సుమారు మూడేళ్ల పాటు రాష్ట్ర ఏర్పాటుకు కాలయాపన చేస్తూ వచ్చారు.
ఎప్పుడైతే జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లిపోయారో ఆ తర్వాత ఉభయరాష్ట్రాలకి ఆమోదయోగ్యుడైన బలమైన నాయకుడు కాంగ్రెస్ పార్టీలో లేకపోవడం వల్లనే ఆమె రాష్ట్ర విభజనకి అంగీకరించి ఉండొచ్చనే వాదన కూడా ఉంది. రాజశేఖరరెడ్డి తర్వాత సీఎంలుగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య అసమర్ధత, కిరణ్ కుమార్ రెడ్డి అహంభావంతో కాంగ్రెస్ హైకమాండ్ విభజన నిర్ణయాన్ని తీసుకుంది.

అంతేకాదు ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ పట్ల వ్యతిరేకత ప్రదర్శించారు. దీంతో కేసీఆర్, ప్రొఫెసర్ కోదండరాంల నేతృత్వంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమాలు తీవ్ర రూపం దాల్చి తెలంగాణను సాధించుకునేలా చేశాయి.
అతివిశ్వాసంతో కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీ పెట్టుకున్న జగన్ తన ముఖ్యమంత్రి కలను సాకారం చేసుకోలేకపోయారు. ఇక 2019 ఎన్నికల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్‌కు చెందిన జనసేన పార్టీ కూడా ఎన్నికల బరిలోకి దిగుతుంది. పవన్ కళ్యాణ్ రాజకీయ ఎంట్రీ తప్పనిసరిగా మిగతా పార్టీలపై ప్రభావం చూపుతుంది.
2019 ఎన్నికల్లో ఏపీలో హంగ్ ఏర్పడిన ఆశ్చర్య పోవాల్సిన పని లేదు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ ఏపీకి ప్రత్యేకహోదాను సాధించే క్రమంలో కొంత మేరకు ప్రజల్లోకి తీసుకెళ్లింది. అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా హోదా ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేందుకు ప్రణాళిక రచించుకున్నారు.
ఈ క్రమంలో 2019లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చేది చెప్పలేం. 2019 ఎన్నికల్లో ప్రత్యేకహోదానే అన్ని పార్టీలకు ప్రధాన ఏజెండాగా మారే అవకాశం లేకపోలేదు.












Click it and Unblock the Notifications