బాధ్యత బాబుదే, పదవి ఊడినా: వీర్రాజు ఆగ్రహం, బాలకృష్ణకు కౌంటరా?
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం విడుదల చేసిన నిధుల వివరాలను ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ఉందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు సోమవారం అన్నారు.
ఆయన తమ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ పైన చాలాకాలంగా మాటల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా మరోసారి ఆయన మాటల దాడి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయాన్ని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తోందని చెప్పారు.
ఇలాంటి సమయంలో కేంద్రం నుంచి వస్తున్న సాయం, నిధుల వివరాలను చంద్రబాబు ప్రజలకు చెప్పాలన్నారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకోకుండా అవగాహనరాహిత్యంతో ఎవరైనా అవాకులు, చెవాకులు పేలితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరు వ్యాఖ్యానించినా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఈ క్రమంలో తమ పదవులు ఊడినా పట్టించుకోమని తేల్చి చెప్పారు. టిడిపి ప్రభుత్వం పైన సోము వీర్రాజు తనకు చిక్కినప్పుడల్లా మాటల తుటాలూ పేల్చుతున్న విషయం తెలిసిందే.
కాగా, హీరో, హిందూపురం టిడిపి శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం ఉదయం మాట్లాడుతూ... కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందన్న నమ్మకం ఉందని, ప్రత్యేక హోదా పైన హామీ ఇచ్చారని చెబుతూనే... హోదా పై హామీ నిలబెట్టుకోకుంటే తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతీసినట్లేనని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి.












Click it and Unblock the Notifications